న్యూఢిల్లీ, మే 30: ఆరుగురు అంతకన్నా ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్న పౌరుల ఓటు హక్కును తొలగించ వచ్చా? అంటే తొలగించవచ్చుననే అంటున్నారు యూపీలోని ఎన్నికల అధికారులు. మీకు ఆరుగురు పిల్లలున్నారా అంటూ ఈసీ ఈ ఏడాది జనవరి 6న వారణాసి కంటోన్మెంట్ పరిధిలోని సోనుగిరీ (35)కి నోటీస్ పంపింది. అతను అవునని సమాధానం ఇవ్వడంతో తుది జాబితాలో అతని పేరును తొలగించారు. ఇలాంటి కారణంతో నియోజకవర్గంలోని 20 బూత్ల పరిధిలో వేలాది మంది పేర్లను తొలగించినట్టు నేషనల్ హెరాల్డ్ తన అధ్యయనంలో పేర్కొంది.
ఇలా తొలగించిన ఓటర్లను ‘క్యూ’ కేటగిరీలో చేర్చారు. అలాగే తాతయ్య, అమ్మమ్మల వయసుకు, ఓటరు వయసుకు మధ్య 40 ఏండ్ల కన్నా తక్కువ తేడా ఉన్నా, ఓటరుకు, వారి తల్లిదండ్రుల మధ్య 15 ఏండ్ల లోపు వ్యత్యాసం ఉంటే ఆ వ్యక్తి ఓటును తొలగించారు. యూపీ మాజీ ప్రధాన ఎన్నికల అధికారి నూర్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన సర్ ప్రక్రియ అనుమానాస్పదంగా ఉన్నదని, అర్థం లేని కారణాలు చూపి వేలాది మంది ఓట్లను తొలగించినట్టు కనిపిస్తున్నదని, దీనిని తిరిగి నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.