శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రెండు దశలు ముగియగా ప్రస్తుతం చివరి విడత పోలింగ్ కొనసాగుతున్నది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. ఆఖరి దశలో 40 నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ స్థానాల్లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు సహా 415 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
జమ్మూలో 11, సాంబలో 3, కథువాలో ఆరు, ఉధమ్పూర్లో 4, బారాముల్లాలో 7, బందిపొరలో 3, కుప్వారాలో 6 నియోజకవర్గాలకు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగుతున్నది. మొత్తం 39.18 లక్షల మంది ఓటర్ల కోసం 5060 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 20 వేల మందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ఓటుహక్కు పొందిన పశ్చిమ పాకిస్థాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగలు మొదటిసారిగా ఓటు వేయనున్నారు. సెప్టెంబర్ 18న జరిగిన మొదటి దశలో 61.38 శాతం, అదేనెల 26న జరిగిన రెండో దశలో 57.31 శాతం పోలింగ్ నమోదయింది. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.
పోటీలో ఉన్న కీలక అభ్యర్థులు..
పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్, మాజీ మంత్రి సజ్జాద్ లోన్, నేషనల్ పాంథర్స్ పార్టీ ఇండియా అధ్యక్షుడు దేవ్ సింగ్‌లు మూడో దశ ఎన్నికల బరిలో ఉన్నారు. కుప్వారా నుంచి సజ్జాద్ లోన్ పోటీ చేస్తుండగా, ఉధంపూర్‌లోని చెనాని స్థానంలో దేవ్ సింగ్ బరిలో నిలిచారు. అదేవిధంగా జమ్ముకశ్మీర్ మాజీ మంత్రులు రమణ్ భల్లా, ఉస్మాన్ మజీద్, నజీర్ అహ్మద్ ఖాన్, తాజ్ మొహియుద్దీన్, బషరత్ బుఖారీ, ఇమ్రాన్ అన్సారీ, గులాం హసన్ మీర్, చౌదరి లాల్ సింగ్ పోటీచేస్తున్నారు.
#WATCH | J&K: People queue up at a polling station in Jammu to vote in the 3rd & final phase of the Assembly elections today.
Eligible voters in 40 constituencies across 7 districts of the UT are exercising their franchise today. pic.twitter.com/5TnfLaSyOH
— ANI (@ANI) October 1, 2024