భోపాల్: బీజేపీ ఎమ్మెల్యే మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. డబ్బు, మద్యం, బహుమతులు వంటి ప్రలోభాలకు లొంగే ఓటర్లు మరో జన్మలో జంతువులుగా పుడతారని అన్నారు. (Voters Will Be Reborn As Animals) దేవుడితో తాను ప్రత్యక్షంగా మాట్లాడతానని చెప్పారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 16న మోవ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హసల్పూర్ గ్రామంలో జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉషా ఠాకూర్ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల ద్వారా ప్రతి లబ్ధిదారుడి ఖాతాల్లోకి వేల రూపాయలు వస్తున్నాయని తెలిపారు. ఆ తర్వాత కూడా ఓటును అమ్ముకుంటే అది మనుషులకే సిగ్గుచేటని అన్నారు.
కాగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలను ఉషా ఠాకూర్ కోరారు. ఓటు వేసేటప్పుడు చిత్తశుద్ధిని కోల్పోవద్దని చెప్పారు. ‘డబ్బు, చీరలు, గాజులు, మద్యం తీసుకుని ఓటు వేసే వారు వచ్చే జన్మలో కచ్చితంగా ఒంటెలు, గొర్రెలు, మేకలు, కుక్కలు, పిల్లులు అవుతారు. ఇది మీ డైరీలో రాసుకోండి. ప్రజాస్వామ్యాన్ని అమ్ముకునే వారు మళ్లీ జన్మలో ఇలా జంతువులవుతారు. ఇది రాసుకోండి. దేవుడితో నాకు ప్రత్యక్ష సంభాషణ ఉంది. నన్ను నమ్మండి’ అని అన్నారు. దేశం, మతం, సంస్కృతికి సేవ చేసే బీజేపీకి మాత్రమే ఓటు వేయాలని కోరారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.