Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో పర్యటించనున్నారు. అయితే, ఇప్పటి వరకు తేదీ ఖరారు కాలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు రష్యా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి యూరీ ఉషాకోవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదికోసారి సమావేశంలో కావాలని నేతలు ఒప్పందం చేసుకున్నారన్నారు. ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందిందన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పర్యటన తేదీ ఖరారయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలయ్యాక పుతిన్ భారత్‌లో పర్యటించనుండడం ఇదే తొలిసారి కానున్నది. ఈ పర్యటన పుతిన్‌కు ఎంతో కీలకం కానున్నది.
ముఖ్యంగా ఇరుదేశాలు యుద్ధం ఆపాలని భారత్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి రష్యా, భారత్ మధ్య ఓ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం అగ్రనేతలు సంవత్సరంలో ఒకసారి ఒకరి దేశంలో మరొకరు సంప్రదించాల్సి ఉంది. ఈ మేరకు పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. అయితే, ఆయన రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. భారత్ రిపబ్లిక్ డే వేడుకలకు వివిధ దేశాలకు చెందిన ప్రధానులు, అధ్యక్షులను ఆహ్వానించే విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రధాని మోదీ రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. జులైలో రష్యాలో పర్యటించి.. శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. తర్వాత బ్రిక్స్ సదస్సుకు మోదీ హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం భారత్‌లో పర్యటించనున్నారు. క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు రానున్నారు.