Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రష్యా మీడియాకు చెందిన సిస్టర్ ఛానెల్ ఆర్టీ మీడియా(RT Media)లో పుతిన్ భారతీయ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ లెజెండ్, దివంగత రాజ్ కపూర్ (Raj Kapoor) పేరును ప్రస్తావించారు రష్యా అధినేత. ఒకప్పుడు రాజ్ కపూర్ భారతీయ సినిమాను ఏలారని, రష్యాలోనూ ఆయనకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండేవారనే పుతిన్ పేర్కొన్నారు. అయితే.. అప్పటికీ, ఇప్పటికీ చాలా విషయాలు మారాయని.. కానీ ఈ దశాబ్దాల కాలంలో భారత్ – రష్యా స్నేహబంధం బలోపేతమైందని పుతిన్ వెల్లడించారు.
నాలుగేళ్ల తర్వాత రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు విచ్చేసిన పుతిన్ బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం రాత్రి పాలం విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మీయ స్వాగతం తర్వాత ప్రధాని కార్యాయం చేరుకున్న పుతిన్.. శుక్రవారం లంచ్ సమయంలో భారతీయ సినిమా, రష్యా – భారత్ ద్వైపాక్షిక సంబంధాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
‘రాజ్‌కపూర్ కాలం నుంచి ఇప్పటికీ చాలా రోజులు గడిపోయాయి. భారత్‌లో చాలా మార్పులు వచ్చాయి. కానీ, అప్పటికీ ఇప్పటికీ మారనిదల్లా ఇరుదేశాల దోస్తీనే. రాజ్ కపూర్ గురించి రష్యాకు చెందిన కవి, నటుడు గాయకుడు వ్లాదిమిర్ విసోట్కీ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నా. ఆయన చెప్పిన ఇతర మాటలు కూడా ఉన్నాయి’ అని పుతిన్ భారత్- రష్యా అనుబంధం గురించి వివరించారు.
BIG NEWS 🚨 Putin recalls Raj Kapoor 😅
He said “India has changed a lot since Raj Kapoor’s era, but one thing remains unchanged, our friendship and our shared commitment to cooperation” 🔥 pic.twitter.com/iwyvGRiYsA
— News Algebra (@NewsAlgebraIND) December 5, 2025
‘అంతేకాదు ఒకప్పుడు భారత్ అంటే యోగాకు ఫేమస్. కానీ, ఇప్పుడు ఇండియన్స్ రికార్డులు బద్దలుకొడుతున్నారు. తమకు నచ్చింది తింటున్నారు, తాగుతున్నారు. ఇదంతా మీకు జోక్‌లా అనిపించవచ్చు. వాస్తవం ఏంటంటే.. భారత ఆర్ధిక వ్యవస్థ ఎంతో మారిపోయింది. ద్వైపాక్షిక భాగస్వామిగా భారత దేశం సామర్ద్యాలు మారిపోయాయి. కానీ, ఒకరికొకరు సహకరించుకునే విషయంలో మా రెండు దేశాల స్నేహం, పరస్పర అవసరాలు మాత్రం కొంచెం కూడా మారలేదు’ అని పుతిన్ వెల్లడించారు.