భువనేశ్వర్: తన రాజకీయ వారసుడు వీకే పాండియన్ కాదని ఒడిశా తాజా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) తెలిపారు. తన వారసుడు ఎవరో అన్నది ఒడిశా ప్రజలు నిర్ణయిస్తారని బీజూ జనతా దళ్ (బీజేపీ) చీఫ్ అన్నారు. అయితే తమిళనాడుకు చెందిన ప్రభుత్వ బ్యూరోక్రాట్ నుంచి రాజకీయవేత్తగా మారిన తన ప్రధాన అనుచురుడ్ని ఆయన సమర్థించారు. పాండియన్ తనను శాసిస్తున్నట్లు బీజేపీ చేసిన ఆరోపణలను నవీన్ పట్నాయక్ ఖండించారు. పార్టీ సభ్యుడైన పాండియన్పై విమర్శలు దురదృష్టకరమని అన్నారు. ‘ఆయన (పాండియన్) పార్టీలో చేరాడు. ఏ పదవిని నిర్వహించలేదు. ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అధికారిగా గత పదేళ్లలో వివిధ రంగాల్లో, రెండు తుఫానులు, కరోనా మహమ్మారి సమయంలో అద్భుతంగా పని చేసాడు. పదవీ విమరణ తర్వాత బీజేడీలో చేరాడు. పార్టీ కోసం కూడా అద్భుతంగా పని చేయడం ద్వారా ఎక్కువగా సహకరించాడు. అతడు నీతి, నిజాయితీ గల వ్యక్తి. దానిని గుర్తుంచుకోవాలి’ అని అన్నారు.
కాగా, ఒడిశా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజూ జనతా దళ్ (బీజేడీ) ఘోర పరాజయం పొందింది. 147 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ 78 సీట్లు గెలుచుకోగా బీజేడీ 51 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలిచింది. అలాగే 21 లోక్సభ స్థానాలకు 20 బీజేపీ దక్కించుకుంది. బీజేడీ ఒక్క సీటుకే పరిమితమైంది. ఈ ఫలితాల నేపథ్యంలో వరుసగా ఐదుసార్లు సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ఆరోసారి ఆ అవకాశాన్ని కోల్పోయారు.