పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ నాయకుడు, మంత్రి విశ్వజిత్ రాణే గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఏడు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన విశ్వజిత్ రాణేను చూసి ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. గోవా సీఎం రాణే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రాణే ఆనందభాష్పాలు రాల్చాడు. తనకు అండగా నిలిచిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ క్రెడిట్ ప్రధాని మోదీకేనని రాణే పేర్కొన్నారు. గోవా అభివృద్ధికి మోదీ అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. తన మీద ప్రజలు నమ్మకం ఉంచి గెలిపించినందుకు వారికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఇది ప్రజల విజయం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ప్రజలను మోసం చేశాయని విశ్వజిత్ రాణే తెలిపారు. రాణే భార్య దేవియా విశ్వజిత్ రాణే కూడా పోరియం నియోజకవర్గంలో 13 వేల ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు.