Karti Chidambaram | చైనా వీసా స్కాం కేసులో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కార్తి చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని స్థానిక న్యాయస్థానం శుక్రవారం కొట్టి పారేసింది. ఈ చైనా వీసా స్కాం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్నది.
ముందస్తు బెయిల్ కోసం కార్తి చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌కు ఎటువంటి ప్రాతిపదిక లేదని ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఎంకే నాగ్‌పాల్ పేర్కొన్నారు. ఈ స్కామ్‌కు సంబంధించి ఇటీవలే ఈడీ కేసు నమోదు చేసింది.
పీ చిదంబరం 2011లో కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు 263 మంది చైనీయులకు వీసాలు జారీ చేయడంలో కార్తి చిదంబరం అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కార్తి చిదంబరంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇదే అంశంపై ఇంతకుముందు సీబీఐ కేసు నమోదు చేసింది.