(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): వలసదారులు, విద్యార్థి వీసాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న కఠిన నిర్ణయాలు భారతీయుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదాన్ని చూపిస్తూ విదేశీయులపై ఆయన విధిస్తున్న ఆంక్షలు ఇండియన్స్ ‘డాలర్ డ్రీమ్స్’ను కల్లలుగా మారుస్తూ పర్యాటకులను కూడా భయపెడుతున్నాయి. భారతీయ పర్యాటకులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు అమెరికా ఎంబసీ తాజాగా జారీ చేసిన ‘ఐ-94’ అడ్వైజరీ కొత్త ఆందోళనకు దారితీసింది.
అమెరికాకు వెళ్లే భారతీయ ఉద్యోగులు, విద్యార్థులు, పర్యాటకులు ‘అడ్మిట్ అన్టిల్ డేట్’కు మించి అక్కడ ఉండొద్దని ఎంబసీ హెచ్చరించింది. ‘వీసా ఎక్స్పైరీ తేదీ’, ‘అడ్మిట్ అన్టిల్ డేట్’కు మధ్య తేడా ఉందని తెలిపింది. ‘ఐ-94’ ఫామ్ లేదా అడ్మిషన్ స్టాంప్‌పై ‘అడ్మిట్ అన్టిల్ డేట్’ ఉంటుందని, అది ముగిసేలోగా అమెరికా నుంచి తిరిగి వచ్చేయాలని భారతీయులకు సూచించింది. ఈ తేదీకి మించి అమెరికాలో ఉంటే వీసాను రద్దు చేసి, వెంటనే స్వదేశానికి పంపిస్తామని హెచ్చరించింది. ఈ విధంగా జరిగితే భవిష్యత్తులో వీసాలు పొందేందుకు అర్హత ఉండదని, పదేండ్లపాటు నిషేధం కొనసాగుతుందని తేల్చి చెప్పింది. యూఎస్ నుంచి పంపించివేయడానికే ఇలాంటి కొత్త నిబంధనలను తెస్తున్నట్టు భారతీయులు మండిపడుతున్నారు.
బీ-1, బీ-2 రకాల విజిటర్ వీసాలు, ఎఫ్-1 విద్యార్థి వీసా, హెచ్-1బీ వర్కర్ వీసాలు పొందే వారికి అమెరికాకు వెళ్లగానే ‘ఐ-94 ఫామ్’ అందిస్తారు. ఈ పత్రంలో నిర్దిష్టమైన క్యాలెండర్ తేదీ ఉంటుంది. అంటే సదరు వ్యక్తి అమెరికాలోకి ప్రవేశిస్తున్న తేదీ, తిరిగి వెళ్లిపోవాల్సిన తేదీ (డెడ్‌లైన్) తదితర వివరాలు ఉంటాయి. సదరు వ్యక్తి అమెరికాలో ఉండేందుకు ఇచ్చిన తుది గడువు(డెడ్‌లైన్)నే ‘అడ్మిట్ అన్టిల్ డేట్’ అంటారు. ఈ గడువులోగా ఆ వ్యక్తి అమెరికాను వదిలి వెళ్లిపోవాలి. ఇక, ‘వీసా ఎక్స్పైరీ తేదీ’ని పర్యాటకుల పాస్‌పోర్టులో స్టాంప్ చేస్తారు. పర్యాటకుడు అమెరికాలోకి ప్రవేశించేందుకు ఉండే తుది గడువు తేదీని ‘వీసా ఎక్స్పైరీ తేదీ’ అంటారు.
విద్యార్థి లేదా ఉద్యోగ వీసాదారులకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) మరో షాక్ ఇచ్చింది. అమెరికాకు వ్యతిరేకంగా లేదా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలతో సంబంధాలు ఉన్నవారికి వీసాలను నిరాకరిస్తామని, అలాంటి వారు ఇప్పటికే వీసాలు కలిగి ఉంటే వాటిని కూడా రద్దు చేస్తామని తేల్చిచెప్పింది. ఇక, అమెరికాలో ప్రవేశించాలనుకునే వారి అర్హతను నిర్ధారించేందుకు వారి ఫేస్బుక్, ఎక్స్, లింక్డ్ఇన్, టిక్‌టాక్ వంటి సామాజిక మాధ్యమాల ఖాతాలను తనిఖీ చేయడాన్ని (సోషల్‌మీడియా వెట్టింగ్) ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే తప్పనిసరి చేసింది. విద్యార్థి లేదా వర్క్ వీసాపై ఉన్నవారు డ్రంకెన్ డ్రైవింగ్‌లో దొరికితే వారి వీసాను రద్దు చేస్తున్నారు. అమెరికాలోని విద్యాసంస్థల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులు కాలేజీ మానేసినా, విద్యా సంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్‌కు వెళ్లినా.. అదేపనిగా క్లాసులకు ఎగ్గొడుతూ హాజరు శాతం తక్కువగా ఉన్నా .. వారి వీసాలను రద్దు చేస్తామని ట్రంప్ సర్కారు ఇప్పటికే ప్రకటించింది.
ట్రంప్ సర్కారు ఆంక్షల నేపథ్యంలో హెచ్-1బీ, ఎల్-1 వర్క్ వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో గుబులు పెరుగుతున్నది. అమెరికాలో ఉద్యోగం కోల్పోతే ఏం చేస్తారని ఓ సంస్థ తన సర్వేలో ప్రశ్నించగా ఇండియాకు తిరిగొస్తామని 45 శాతం మంది, మరో దేశానికి వెళ్తామని 26 శాతం మంది, ఇంకా ఏమీ తేల్చుకోలేదని 29 శాతం మంది పేర్కొన్నారు.