న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఈ ఏడాదిని కూడా వదల్లేదు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. మరోవైపు, ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని వణికించాయి. అమెరికా సేనలు వైదొలగడంతో అఫ్గాన్‌లో తిరిగి తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టారు. ఈ ఏడాది చోటుచేసుకున్న ముఖ్య ఘటనలు…
క్యాపిటల్ భవనంపై దాడులు
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు అమెరికా క్యాపిటల్ భవనంపై జనవరి 6న దాడికి పాల్పడి బీభత్సం సృష్టించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీకి చెందిన అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించే ప్రక్రియకు ఆటంకం కలిగించే ఉద్దేశంతో వందలాది మంది ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లారు. ఈ ఘర్షణలో ఆరుగురు చనిపోయారు.
సైనిక తిరుగుబాట్లు
ఫిబ్రవరిలో ప్రజాప్రభుత్వాన్ని గద్దె దింపిన మయన్మార్ మిలటరీ జుంటా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అంగ్‌సాన్ సూకీ సహా కీలక నేతలను గృహనిర్బంధం చేసింది. సైనిక చర్యలకు వ్యతిరేకంగా పౌరులు వీధుల్లోకి వచ్చారు. దీంతో మిలిటరీ దాడులకు పాల్పడగా.. వందలాది మంది మరణించారు. మాలి, గినియా, ట్యునీషియాల్లోనూ సైనిక తిరుగుబాట్లు చోటుచేసుకున్నాయి.
ఎవర్ గివెన్ షాక్
అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కీలక పాత్ర పోషించే ఈజిప్టులోని సూయజ్ కాలువ మార్గంలో మార్చిలో భారీ సరకు రవాణా నౌక ‘ఎవర్ గివెన్’ అడ్డంగా ఇరుక్కుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నౌక ఇసుక మేటల్లో కూరుకుపోయింది. వారం తర్వాత నౌకను సరి చేశారు. నౌక అడ్డం తిరుగడంతో వ్యాపారాలు స్తంభించి రూ. 5.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.
కరోనా టీకా అందుబాటులోకి
అమెరికా, ఐరోపా, భారత్, రష్యాలో కరోనా విలయతాండవం చేసింది. లక్షలాది మంది మృతిచెందారు. ఆక్స్ఫర్డ్ వర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధిచేసిన కొవిడ్-19 టీకా ‘కొవిషీల్డ్’ వ్యాక్సినేషన్ ప్రపంచంలోనే ప్రప్రథమంగా జనవరి 4న బ్రిటన్‌లో మొదలైంది. కరోనా కొత్త రూపాంతరాలు డెల్టా, డెల్టా ప్లస్, లాంబ్డా, ఒమిక్రాన్‌లు వివిధ దేశాలను హడలెత్తించాయి. కొవిడ్ కట్టడికి ఫైజర్, మెర్క్ తయారుచేసిన గోలీలకు అమెరికా ఆమోదం లభించింది.
అఫ్గాన్‌లో తాలిబన్ల రాజ్యం
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగగానే అఫ్గ్గాన్ పగ్గాలను తాలిబన్లు హస్తగతం చేసుకొన్నారు. తాలిబన్ల రాజ్యంలో ఉండలేని పౌరులు దేశం విడిచిపోవడానికి విమానాల చక్రాలను పట్టుకొని ప్రమాదకరంగా ప్రయాణించారు. మహిళలపై తాలిబన్లు క్రూరమైన ఆంక్షలను మళ్లీ తీసుకొచ్చారు.
కార్చిచ్చులు, వరదల బీభత్సం
అమెరికా, గ్రీస్, స్పెయిన్, ఆస్ట్రేలియాలలో కార్చిచ్చులు బీభత్సం సృష్టించాయి. కెనడాలో హీట్ డోమ్‌తో ప్రజలు అల్లాడిపోయారు. జర్మనీ, చైనా, భారత్‌ను వరదలు ముంచెత్తాయి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్, ఇజ్రాయెల్ మధ్య మేలో 11 రోజుల పాటు హోరాహోరీగా క్షిపణి దాడులు జరిగాయి. ఈ ఘర్షణల్లో మొత్తం 240 మంది మరణించారు. హింసను తక్షణమే ఆపాలంటూ అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడికి ఇజ్రాయెల్ తలొగ్గింది.