Viral news : దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి జడ్జి నోటీసులు జారీచేశారు. పోలీసులు ఆ నోటీసులు దొంగకు అందజేయాల్సి ఉంది. అందుకోసం ఓ ఎస్సైని పురమాయించారు. అయితే ఆ ఎస్సై నోటీసులు అందజేసేందుకు దొంగకు బదులుగా జడ్జి కోసం వెతికాడు. దాంతో దొంగకు నోటీసులు ఇవ్వడంలో విఫలమయ్యాడు. ఆ నోటీసులను తిరిగి కోర్టుకు సమర్పిస్తూ ఎస్సై చెప్పిన సమాధానం విన్న జడ్జి అవాక్కయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ బన్వారిలాల్.. దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లాడు. అయితే నోటీసుల మీద ఉన్న అడ్రస్ దగ్గర దొంగ పేరు రాసుకోవాల్సి ఉండగా.. ఆ ఎస్సై పొరపాటున జడ్జి నగ్మా ఖాన్ పేరు రాసుకున్నాడు. దొంగ తనం చేసిన వ్యక్తి ఏరియాకు వెళ్లి నగ్మా ఖాన్ ఎక్కడున్నాడంటూ ఆరా తీశాడు.
అయితే స్థానికులు నగ్మా ఖాన్ పేరుతో ఇక్కడ ఎవరూ లేరని చెప్పడంతో వెనుదిరిగి వచ్చాడు. మరసటి వాయిదా సందర్భంగా కోర్టుకు వచ్చిన ఎస్సై తనకు అప్పగించిన నోటీసులను కోర్టుకు తిరిగిచ్చారు. నోటీసులలో పేర్కొన్న దొంగ పేరుతో అక్కడ ఎవరూ లేరని, నోటీసులను సవరించి మళ్లీ ఇవ్వాలని కోరారు. ఎస్సై తిరిగిచ్చిన నోటీసులను పరిశీలించిన ఆ మహిళా జడ్జి నగ్మా ఖాన్ అవాక్కయ్యారు. ఎస్సై బన్వారీలాల్ దొంగ పేరు రాయాల్సిన చోట తన పేరు రాయడం చూసి ఆగ్రహం వ్యక్తంచేశారు.
కోర్టు ఎవరికి, ఏ తరహా నోటీసులు పంపిందో పోలీసు అధికారికి తెలియకపోవడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. ఇంత నిర్లక్ష్యమా..? అంటూ మండిపడ్డారు. సదరు పోలీస్ అధికారి కనీసం ఆ నోటీసులను చదవలేదని, వాటి గురించి అతడికి కనీస జ్ఞానం కూడా లేదనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టు నోటీసులు అందించే వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా బన్వారిలాల్‌పై చర్యలు తీసుకోవాలని యూపీ పోలీస్ చీఫ్‌ను ఆదేశించారు.