Dominos Viral Boy | ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో పాపులారిటీ కోసం ఏ స్థాయికైనా దిగజారుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ ఒక వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపింది. ఒక యువతి రోడ్డు పక్కన డొమినోస్ డెలివరీ ఏజెంట్ దుస్తుల్లో ఉన్న తన పాత క్లాస్‌మేట్‌ను చూసి అత్యంత హీనంగా ఎగతాళి చేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. స్కూల్లో టాపర్‌గా ఉన్న వ్యక్తివి ఇప్పుడు ఇలా పిజ్జాలు డెలివరీ చేస్తున్నావా అని, కనీసం నీకు ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుందా అంటూ ఆయుషి సింగ్ అనే యువతి తరుణ్ సింగ్ అనే యువకుడిని కించపరచడం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. కష్టపడి పని చేసే వ్యక్తిని అలా నవ్వుతూ వెక్కిరించడంపై సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శల వర్షం కురిసింది. అయితే ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న తరుణంలో అసలు విషయం వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ వీడియో వెనుక ఉన్న అసలు నిజం ఏమిటంటే.. ఇదంతా కేవలం వ్యూస్ కోసం వారిద్దరూ ఆడిన ఒక డ్రామా అని తెలిసింది. ఆయుషి సింగ్ మరియు తరుణ్ సింగ్ ఇద్దరూ స్నేహితులు మాత్రమే కాకుండా కంటెంట్ క్రియేటర్లు అని తేలిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం.. సమాజంలో డెలివరీ బాయ్స్ పట్ల ఉండే వివక్షను చూపిస్తున్నామనే సాకుతో వారు ఈ నాటకానికి తెరలేపారు. తరుణ్ అసలు డొమినోస్ ఉద్యోగి కాదని, కేవలం వీడియో షూట్ కోసమే ఆ యూనిఫాం ధరించాడని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ వివాదం ముదరడంతో తమపై వస్తున్న విమర్శలకు భయపడి, తాము కేవలం ప్రాంక్ చేశామని, ఎవరూ తరుణ్‌కు డబ్బులు పంపవద్దని వారు ఒక వివరణ వీడియోను విడుదల చేశారు. సానుభూతిని వ్యాపారంగా మార్చుకున్న వీరి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి నకిలీ వీడియోల వల్ల నిజంగా ఆపదలో ఉండి సహాయం కోరేవారిని కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.
Pain in his eyes… mfs, don’t ever do this. He’s still doing something with his life, he hasn’t lost…stay strong bro❤️ pic.twitter.com/jwN7rzGsOM
— Wellu (@Wellutwt) January 29, 2026
Here’s the truth about the Viral Dominos guy. pic.twitter.com/3fNAYNBLKW
— Mohammed Zubair (@zoo_bear) January 29, 2026