లక్నో: రైస్ బ్రాన్ ఆయిల్ రవాణా చేస్తున్న ట్యాంకర్, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు గాయపడ్డారు. ఆయిల్ ట్యాంకర్ దెబ్బతినడంతో నూనె కారసాగింది. దీంతో నూనెను పట్టుకునేందుకు స్థానికులు పోటీ పడ్డారు. (Villagers Loot Oil) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ఫతేహాబాద్లో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో లక్నో నుంచి ఆగ్రా వైపు వెళ్తున్న ప్రయాణికుల బస్సు, ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికుల్లో కొందరు గాయపడ్డారు.
కాగా, ట్యాంకర్ దెబ్బతినడంతో ఆయిల్ లీక్ అయింది. దీంతో నూనెను సేకరించేందుకు స్థానికులు ఎగబడ్డారు. బకెట్లు, బాటిళ్లతో గుంపులుగా అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పెనుగులాట జరిగింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. గాయపడిన బస్సు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. దెబ్బతిన్న ట్యాంకర్ను సంఘటనా స్థలం నుంచి తొలగించారు. కాగా, ఆయిల్ కోసం స్థానికులు గుమిగూడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
आगरा–लखनऊ एक्सप्रेस वे पर एक्सीडेंटल टैंकर से तेल लूटने के लिए मारामारी मच गई !! pic.twitter.com/21YJusMcOo
— Sachin Gupta (@SachinGuptaUP) March 19, 2025