న్యూఢిల్లీ, మే 8: ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలకు తెరలేపింది తొలుత పాకిస్థాన్ అని భారత్ స్పష్టంచేసింది. గత నెల 22న పహల్గాంలో పాక్ ఉగ్ర మూకలు 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకోవడంతో ఇది మొదలైందని తెలిపింది. ఆ దాడికి భారత సాయుధ దళాలు బుధవారం జవాబు చెప్పాయని పేర్కొంది.
విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ గురువారం సాయంత్రం కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత దళాలు ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. తమ దాడుల్లో సామాన్య పౌరులుగానీ, పాక్ సైనిక సదుపాయాలు గానీ ధ్వంసం కాలేదని చెప్పారు. కానీ, జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ జరుపుతున్న ప్రతీకార దాడుల్లో భారతీయ పౌరులు మరణిస్తున్నారని తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లో సిక్కులు లక్ష్యంగా పాకిస్థాన్ దాడులకు పాల్పడుతున్నదని మిస్రీ చెప్పారు. పూంచ్ జిల్లాలో పాక్ జరిపిన దాడిలో ఒక గురుద్వారా ధ్వంసమైందని, పలువురు సిక్కుల ఇండ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించారని చెప్పారు. పాక్ సైన్యం సరిహద్దుకు అవతలి నుంచి జరుపుతున్న కాల్పుల్లో ఇప్పటికి 16 మంది పౌరులు మరణించారని వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన దాడుల్లో మృతిచెందిన ముష్కరులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్‌కు ఇది అలవాటుగా మారిందని పేర్కొంది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు ప్రదర్శించిన ఒక చిత్రంలో.. ఉగ్రవాదుల మృతదేహాలను ఉంచిన శవపేటికల వద్ద సైనిక దుస్తుల్లో ఉన్న పాక్ సైన్యం, పోలీసు సిబ్బంది ప్రార్థనలు చేస్తుండగా, వారికి లష్కరే తాయిబా ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ వారిని ప్రార్థనలలో నడిపిస్తున్నాడు. ఈ ఫొటో ఎటువంటి సందేశం ఇస్తున్నది అని మిస్రీ ప్రశ్నించారు.