DMK MLA : తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) జోసెఫ్ విజయ్ (Joseph Vijay) నేతృత్వంలోని టీవీకే సర్కారు (TVK govt) ఆరు నెలలు కూడా అధికారంలో కొనసాగలేదని ఆదివారం డీఎంకే సీనియర్ నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ (Anita Radhakrishnan) సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ (MK Stalin) త్వరలోనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పారు. దక్షిణ తమిళనాడులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న రాధాకృష్ణన్.. అధికార తమిళగ వెట్రి కళగం (TVK) సీనియర్ నేత, విల్లివాక్కం ఎమ్మెల్యే ఆధవ్ అర్జున (Adhav Arjuna) కు బహిరంగ సవాల్ విసిరారు.
టీవీకే ప్రభుత్వం మరో నాలుగు నెలలు మాత్రమే మనుగడ సాగిస్తుందని, ఆధవ్ అర్జునకు ధైర్యం ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, తాను కూడా రాజీనామా చేస్తానని, ఇద్దరం తిరుచెందూర్‌లో పోటీపడాలని సవాల్ చేశారు. తిరుచందూర్ తమ అడ్డా అని, ఇక్కడ ఎవరినైనా ఓడిస్తామని రాధాకృష్ణన్ చెప్పారు. గడిచిన 25 ఏళ్లుగా తిరుచందూర్ స్థానం రాధాకృష్ణన్‌కు బలమైన కోటగా ఉందని అన్నారు. కొళత్తూర్ స్థానంలో డీఎంకే మాజీ నేత వీఎస్ బాబు (టీవీకే) చేతిలో ఓడిపోయిన స్టాలిన్‌ను రాధాకృష్ణన్ ఈ సందర్భంగా వెనకేసుకొచ్చారు.
మాజీ సీఎం స్టాలిన్ కొళత్తూర్‌ను సింగపూర్‌లా మార్చారని చెప్పారు. అయినా కొళత్తూర్ ఓటర్లు స్టాలిన్‌ను ఎమ్మెల్యేగా ఓడించారని, అక్కడి ఓటర్లు ‘పనికిరాని వాళ్లు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు స్టాలిన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, ఆయనను తిరుచ్చి నుంచి పోటీ చేయిస్తామని చెప్పారు. కాగా తమిళనాడులో దశాబ్దాల తర్వాత ద్రవిడ పార్టీల నుంచి అధికారం పోయింది. 62 ఏళ్లుగా తమిళనాడును పాలిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల జోరుకు విజయ్ బ్రేక్ వేశారు.