Vijay Shah : భారతదేశపు సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీ (Sofia Khureshi) పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి (Madhyapradesh Minister) విజయ్ షా (Vijay Shah).. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణలు చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడంతో బీజేపీ హైకమాండ్ (BJP High Command) విజయ్ షాను పిలిపించి చీవాట్లు పెట్టింది. దాంతో ఉగ్రవాదుల (Terrorists) దుశ్చర్యలతో తన మనసు వికలమై అలాంటి వ్యాఖ్యలు చేశానని, కులమతాలకు అతీతంగా ఖురేషీ చేసిన సేవలకు తాను సెల్యూట్ చేస్తున్నానని షా అన్నారు.
ఖురేషీని కించపరిచే ఆలోచన తనకు కలలో కూడా రాదని, తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే పదిసార్లు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని విజయ్ షా చెప్పారు. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల సమయంలో కల్నల్ సోఫియా ఖురేషి.. ఫారిన్ సెక్రెటరీ విక్రమ్ మిస్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్తో కలిసి మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చేవారు. ఆమెపై ఇటీవల విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువులను చేశారు. మోదీజీ వాళ్ల (ఉగ్రవాదుల) మతానికే చెందిన వాళ్ల సోదరిని సైనిక విమానంలో పాక్కు పంపించి గుణపాఠం చెప్పారు’ అని వ్యాఖ్యానించారు.
ఇండోర్ సమీపంలోని ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వివాదం రేకెత్తించాయి. విజయ్ షా మంత్రి పదవిపై వెంటనే వేటువేయాలని కాంగ్రెస్ నేతలు ప్రధానిని డిమాండ్ చేశారు. విజయ్ షా వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటుగా, కించపరిచేవిగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు.