అహ్మదాబాద్, జూన్ 14: అహ్మదాబాద్‌లో జూన్ 12న(గురువారం) జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన 241 మందిలో ఒకరైన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆ రోజు ఆ విమానంలో ప్రయాణించాలని ముందుగా భావించలేదు. మే 19న లండన్ బయల్దేరేందుకు మొదట ఆయన ఏఐ171 విమానం టికెట్ బుక్ చేశారు. జూన్ 25న తిరుగు ప్రయాణం టికెట్ కూడా బుక్ చేశారు.
అయితే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుని ఆ టికెట్లు రద్దు చేసి జూన్ 5న లండన్ బయల్దేరేందుకు టికెట్ బుక్ చేశారు. ఆ రెండవ టికెట్ కూడా క్యాన్సిల్ చేసి జూన్ 12న ఏఐ 171 విమానంలో ప్రయాణించేందుకు సీట్ నంబర్ 2డీ టికెట్ బుక్ చేశారు. టేకాఫ్ అయిన 32 సెకండ్లకే ఆయన బయల్దేరిన విమానం కూలిపోయి ఆయనతోసహా 241 మంది ప్రయాణికులు అసువులు బాశారు.
అహ్మదాబాద్‌లో గురువారం(జూన్ 12) జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 68 ఏళ్ల గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతోసహా 241 మంది ప్రయాణికులు మరణించారు. గతంలో కూడా అనేక విమాన ప్రమాదాలు పలువురు రాజకీయ ప్రముఖులను బలి తీసుకున్నాయి.
వారిలో కాంగ్రెస్ నేతలు సంజయ్ గాంధీ, మాధవ్‌రావు సింధియా, వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు లోక్‌సభ మాజీ స్పీకర్, టీడీపీ నేత జీఎంసీ బాలయోగి, పంజాబ్ మాజీ సీఎం గుర్నామ్ సింగ్ తదితరులు ఉన్నారు. 2011లో అప్పటి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖండూ హెలికాప్టర్ కూలి మరణించారు. 2005 మార్చి 31న పారిశ్రామికవేత్త, హర్యానా విద్యుత్ మంత్రి ఓపీ జిందాల్, మాజీ కేంద్ర మంత్రి సురేందర్ సింగ్(మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ కుమారుడు) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో కూలిపోయి వారిద్దరూ మరణించారు.