Actor Vijay | కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలను నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ పరామర్శించారు. 37 బాధిత కుటుంబాలను విజయ్ కలిసేలా తమిళగ వెట్రి కజగం నేతలు మహాబలిపురం రిసార్ట్‌లో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను పరామర్శించి.. వారితో కలిసి భోజనం చేశారు. విజయ్ బాధిత కుటుంబాలకు విద్య, స్వయం ఉపాధి, గృహ నిర్మాణంతో పాటు ఆర్థిక సాయం చేస్తామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు మహాబలిపురానికి రప్పించినందుకు విజయ్ క్షమాపణలు చెప్పారు. అధికారుల నుంచి అనుమతి లేకపోవడంతో తాను కరూర్‌కు రాలేకపోయానని.. త్వరలోనే కరూర్‌కు వచ్చి కలుస్తానని హామీ ఇచ్చారు. దాదాపు మూడుగంటలకుపైగా వ్యక్తిగత సమావేశం జరిగింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలను తన సొంత కుటుంబల్లా చూసుకుంటానని చెప్పారు. సెప్టెంబర్ 27న కరూర్‌లో తొక్కిసలాట జరిగింది దాదాపు 41 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మందికిపైగా గాయపడ్డారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తొక్కిసలాటపై దర్యాప్తును చేస్తున్నది.