TVK Vijay : తమిళనాడులో అత్యధిక స్థానాలు సాధించిన టీవీకే పార్టీ మెజారిటీకి కొద్ది దూరంలో ఉంది. ఇదే సమయంలో పార్టీ లెజిస్లేటివ్ లీడర్‌గా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ ప్రకటించింది. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో విజయ్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై కూడా చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కొన్ని సీట్లు తక్కువగా ఉన్న అంశాన్ని నేతలు ప్రస్తావించారు.
ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ.. రాజకీయపరంగా ఆత్మగౌరవం విషయంలో తమ పార్టీ రాజీపడబోదన్నారు. పొత్తు విషయంలోనూ తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని ఆ పార్టీ నేతలు తెలిపారు. అధికారం చేపట్టేందుకు అవసరమైన మద్దతు కోసం తమ పార్టీ ఎవరినీ అడుక్కోబోదని తెలిపారు. ఇక, మెజారిటీ నిరూపించుకునేందుకు టీవీకే నేతలు గవర్నర్‌ను కలిసి 15 రోజుల సమయం కోరారు. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో టీవీకే 108 సీట్లు సాధించి, అతిపెద్ద పార్టీగా మారింది. అధికారం చేపట్టాలంటే మరో 10 సీట్లు అవసరం. టీవీకేకు 35 శాతం ఓట్లు పోలయ్యాయి.
మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు కోసం టీవీకే ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్‌తో రాయబారం నడుస్తోందని తెలుస్తోంది. విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారు. విజయ్ పార్టీ టీవీకే అధికారం చేపట్టాలంటే పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి. విజయ్ ఎవరితో పొత్తువైపు మొగ్గు చూపుతారో తెలియాలి.