Jagdeep Dhankhar | న్యూఢిల్లీ: తమ డిమాండ్ల సాధన కోసం దీర్ఘకాలంగా నిరసన తెలియచేస్తున్న రైతుల గోడును పట్టించుకోనందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగంలో పెరుగుతున్న అసంతృప్తి పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే రైతులతో చర్చలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు.
బుధవారం ఒక కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. ఇది చాలా తీవ్రమైన విషయమని, దీన్ని తేలికగా తీసుకుంటున్నామంటే మనం దీనిపై ఆచరణాత్మకంగా లేమని, మన విధానాల రూపకల్పన సరైన పంథాలో లేదని భావించాలని స్పష్టం చేశారు. గతంలో రైతులకు చేసిన వాగ్దానాలను రికార్డులలో భద్రపరిచారా? అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతుల సమస్యలను చర్చల రూపంలో ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. రైతులకు గత వ్యవసాయ మంత్రులు లిఖితపూర్వకంగా ఏవైనా వాగ్దానాలు చేశారో లేదో చెప్పాలని ఆయన శివరాజ్‌ను నిలదీశారు.
ప్రపంచ స్థాయిలో భారత్ ప్రతిష్ట పెరుగుతున్నప్పటికీ దేశంలో మాత్రం ప్రభుత్వానికి రైతులకు మధ్య దూరం పెరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచం ఎదుట భారత ప్రతిష్ట ఈ స్థాయిలో అత్యున్నతంగా ఏనాడూ లేదని, కాని రైతులు మాత్రం ఎందుకు ఆగ్రహంతో ఉన్నారని ధన్ఖర్ ప్రశ్నించారు. రైతుల్లో ఎందుకు నిరాశా నిస్పృహలు ఏర్పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను విస్మరించడం వల్ల దేశంలో తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని ఆయన హెచ్చరించారు
రైతుల గొంతును ఏ శక్తి అణచివేయలేదని, రైతు సహనాన్ని పరీక్షించాలని ప్రయత్నిస్తే భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని ధన్ఖర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు బిడ్డనని చెప్పుకోవడానికి తాను గర్విస్తానన్నారు. దేశాన్ని సమైక్యపరచడంలో తన బాధ్యతను అత్యద్భుతంగా నిర్వర్తించిన దేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కేంద్ర వ్యవసాయ మంత్రికి గుర్తు చేశారు. ఇప్పుడు ఈ సవాలు మీ ముందున్నదని, ఇది భారతదేశ సమైక్యత కన్నా తక్కువదేమీ కాదని ఆయన శివరాజ్ సింగ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.
రైతుల పరిస్థితులను మెరుగుపరచడంలో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వంటి వ్యవసాయ సంస్థలు విఫలమయ్యాయని ఆయన తెలిపారు. అవి సజీవంగా ఉండి తమ సేవలను అందచేసి ఉంటే దేశంలో రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడంతోపాటు పంట నష్టపరిహారం, ఇతర ప్రయోజనాలు కోరుతూ మంగళవారం ఆందోళన చేపట్టిన రైతులను నోయిడాలో పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై ఉప రాష్ట్రపతి ఈ స్థాయిలో విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమైంది.
మరోవైపు బుధవారం విపక్షాలపై కూడా ధన్ఖర్ విమర్శలు గుప్పించారు. రైతు సమస్యల పట్ల ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని మండిపడ్డారు. మోదీ సర్కారు రైతు వ్యతిరేకం అంటూ రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంపై ఆయన స్పందిస్తూ.. కేవలం నినాదాలు, మొసలి కన్నీరుతో రైతు సమస్యలు పరిష్కారం కావన్నారు. గత వారం రోజులుగా సభా కార్యక్రమాలను విపక్షాలు అడ్డుకుంటున్నాయని, కానీ అది రైతుల సమస్యలపై కాదని అన్నారు.