KC Venugopal | కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియను యెమెన్‌లో ఉరి తీయకుండా కాపాడాలని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కోరారు. నిమిషాకు మరణశిక్ష విధించడం అన్యాయమన్నారు. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఆమె విదేశీ గడ్డపై ఊహించలేని క్రూరత్వం, గృహహింసకు గురైన బాధితురాలని.. ఆమెను మరణం అంచుకు నెట్టారన్నారు. ఉరి శిక్షను ఆపేందుకు వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు ఆయన ఎక్స్ పోస్టులో వెల్లడించారు. కేరళ నర్సును జూలై 16న యెమెన్‌లో ఉరితీయనున్నారు. ప్రధానమంత్రికి రాసిన లేఖలో వేణుగోపాల్ స్పందిస్తూ.. ‘బాధితురాలి కుటుంబం ఆమె ప్రాణాలను కాపాడేందుకు యాక్షన్ కౌన్సిల్, ఆమె కుటుంబం ప్రయత్నాలు చేసినప్పటికీ, కొనసాగుతున్న అంతర్యుద్ధం, ఇతర అంతర్గత అల్లర్ల కారణంగా ఈ చర్చలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్నాయన్నారు.
మరణశిక్ష నుంచి నర్సును కాపాడటానికి యెమెన్ అధికారులతో సాధ్యమైనంత వరకు అన్ని దౌత్య చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధానమంత్రిని డిమాండ్ చేశారు. ఈ కేసుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, సాధ్యమైన మేరకు జోక్యం చేసుకోవాలని కోరారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని కొల్లెంగోడ్ నివాసి అయిన నిమిషా ప్రియ జులై 2017లో తన యెమెన్ వ్యాపార భాగస్వామిని చంపిన కేసులో 2020 దోషిగా కోర్టు తేల్చింది. గత నవంబర్‌లో యెమెన్ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ఆమె అప్పీల్‌ను తిరస్కరించింది. ప్రియ ప్రస్తుతం సనా సెంట్రల్ జైలులో ఉన్నది. ఈ క్రమంలో ఆమెను కాపాడాలని భారత్‌కు చెందిన పలు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యసభ ఎంపీ సంధోష్ కుమార్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు ఒక లేఖ రాశారు. నర్సు ఉరిశిక్షను ఆపడానికి అన్ని దౌత్య, మానవతా మార్గాలను అవలంబించాలని కోరారు.