బలోడా బజార్: సత్నామీ తెగవారు అత్యంత పవిత్రంగా పరిగణించే జైత్ఖామ్బ్ (స్థూపం)ను గుర్తు తెలియని వ్యక్తులు అపవిత్రం చేయడంతో నిరసనలు పెల్లుబికాయి. ఛత్తీస్‌గఢ్ గిరౌడ్పురి ధామ్‌లోని అమర్ గుహలో ఉన్న ఈ పవిత్ర చిహ్నాన్ని గత నెల 15-16 మధ్య రాత్రి అపవిత్రం చేశారు. ఈ కేసులో పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ, కలెక్టర్ కార్యాలయం వద్ద ఘెరావ్ నిర్వహించాలని సత్నామీ తెగవారు పిలుపునిచ్చారు. బలోడా బజార్ పోలీసు సూపరింటెండెంట్ సదానంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, దాదాపు 5,000 మంది నిరసనకారులు తరలివచ్చి, కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. రాళ్లు విసురుతూ, కొన్ని వాహనాలను తగులబెట్టారు. ఎస్పీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఈ కార్యాలయంలో కొంత భాగం దెబ్బతింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.