Vegetable Price Hike | దేశ రాజధాని ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో వడగాలులు వీస్తున్నాయి. అదే సమయంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వాటి ప్రభావం వంటిల్లుపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తున్నది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా పండ్లు, కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గతవారం రోజుల్లో పలు కూరగాయల ధరలు డబుల్ అయ్యాయి. ఎండలకు పంటలు ఎండిపోతుండగా.. మార్కెట్కు తీసుకువచ్చిన కూరగాయలు సైతం పాడైపోతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీని ప్రభావంతో మార్కెట్లో ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని అతిపెద్ద ఆజాద్పూర్ మార్కెట్లో కూరగాయల సరఫరా పడిపోయిందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
హిమాచల్ చెందిన 25 కిలోల టమాటాను రూ.1000కి చేరింది. కర్ణాటకలో పొలాల నుంచి తీసుకువస్తున్న టమాటకు కిలోకు రూ.40 ధర పలుకుతున్నది. వారం కిందట క్యాప్సికం కిలో ధర రూ.50-రూ.60 వరకు ఉండగా.. ప్రస్తుతం కిలో ధర రూ.110 వరకు పలుకుతున్నది. గతంలో రూ.80 నుంచి రూ.100 పలికిన నిమ్మకాయలు ప్రస్తుతం కిలో రూ.160కి పెరిగాయి. బెల్లం కిలో రూ.150 నుంచి రూ.170కి చేరింది. ఇక యాపిల్, మామిడి, దానిమ్మ, బొప్పాయి, పుచ్చకాయ, సీజనల్ ఫ్రూట్, కొబ్బరిబోండాల ధరలు సైతం 25 నుంచి 30శాతం వరకు ధరలు పైకి చేరాయి. ఆకుకూరల ధరలు పెరగడంతో మార్కెట్లో బంగాళాదుంపలకు డిమాండ్ పెరిగింది.
అయితే, సరఫరా మాత్రం అంతంతమాత్రంగానే ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. బంగాళాదుంపలు ప్రధానంగా యూపీ, బెంగాల్ నుంచి ఎక్కువగా సరఫరా అవుతుంది. శీతాకాలంలో ప్రతికూల వాతావరణంతో దిగుబడి తక్కువగా ఉన్నది. కోల్డ్ స్టోరేజీల నుంచి తీసుకువచ్చిన ఆలుగడ్డలు పాడైపోతున్నాయి. మండుతున్న ఎండలకు పొలాల్లో ఆకుకూరలు మండిపోతున్నాయి. సోరగాయలు, బెండకాయలు, టమాటా మొక్కలు మాడిపోతున్నాయని.. ఉదయం, సాయంత్రం వేళల్లో నీరు పెట్టినా మొక్కలు బతకడం లేదని రైతులు వాపోతున్నారు. ఎండలు, వర్షాల లేమితో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జూన్లో టోకు ద్రవ్యోల్బణం మూడు శాతానికి పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.