Thali price : మన దేశంలో వెజ్, నాన్వెజ్ థాలీల సగటు ధరలు, వాటి ధరల్లో హెచ్చుతగ్గులకు సంబంధించి క్రిసిల్ ఆసక్తికరమైన మంత్లీ రిపోర్టును వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం హోమ్ కుక్డ్ వెజిటేరియన్ థాలీ ధరలు గత నెలతో పోల్చితే ఈ నెల 11 శాతం పెరిగాయి. దాంతో జూన్ నెలలో రూ.29.4గా ఉన్న వెజిటేరియన్ థాలీ ధర ఇప్పుడు రూ.32.6కు పెరిగింది. కూరగాయల ధరలు, ముఖ్యంగా టమాటా ధరలు బాగా పెరగడం ఇందుకు కారణంగా పేర్కొంది.
అదే సమయంలో గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో నాన్ వెజ్ థాలీ ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. జూన్ నెలతో పోల్చితే ఈ నెల నాన్వెజ్ థాలీ సగటు ధర 6 శాతం పెరిగి రూ.61.4కు చేరిందని పేర్కొంది. టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ధరలు పెరగడంతో వెజ్ థాలీ సగటు ధర ఎక్కువగా పెరిగిందని, కానీ బ్రాయిలర్ చికెన్ ధరలు స్థిరంగా ఉండటంతో నాన్ వెజ్ థాలీ ధరల్లో స్వల్ప పెరుగుదల మాత్రమే కనిపిస్తోందని క్రిసిల్ రిపోర్టు తెలిపింది.