VD Satheesan : కేరళ నూతన సీఎంగా వీడీ సతీషన్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కేరళలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం సాయంత్రం కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిశారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా కోరారు.
తనను కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా ఎన్నుకున్నట్లు చెబుతూ సంబంధిత లేఖను గవర్నర్‌కు అందించారు. తనకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు యూడీఎఫ్ కూటమి ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందని గవర్నర్‌కు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం సీఎం ప్రమాణ స్వీకారం, నూతన ప్రభుత్వ ఏర్పాటు వచ్చే సోమవారం ఉదయం పది గంటలకు జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 140 అసెంబ్లీ సీట్లున్న కేరళలో యూడీఎఫ్ 102 సీట్లు సాధించింది. అధికార ఎల్డీఎఫ్ను భారీ తేడాతో ఓడించింది.
ఫలితాలు వెలువడి పది రోజులు అవుతున్నా.. కేరళ సీఎంను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయలేకపోయింది. వీడీ సతీషన్తోపాటు, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల కూడా సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. దీంతో అనేక చర్చలు, అంశాల పరిశీలన అనంతరం సతీషన్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా సతీషన్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. తమ పాలనలో కొత్త కేరళను చూస్తారని వ్యాఖ్యానించారు.