న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరుతో రెండు దశాబ్దాల క్రితం రూపొందిన గ్రామీణ ఉపాధి కల్పనా పథకాన్ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తున్నది. నరేగా స్థానంలో వీబీ-జీ రామ్ జీ బిల్లుని మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. తాజా బిల్లుకు సంబంధించి ప్రధానంగా ఐదు అంశాలపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదనలు సాగుతున్నాయి.
పనిదినాల పెంపు
ముందుగా బిల్లులోని ప్రధాన అంశాల్లో మొదటిది ఉపాధి హామీ పని దినాలు 100 నుంచి 125కి పెరగడం. కాగితంపై చూస్తే ఇది పేదలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించేదిగా ఉన్నప్పటికీ నరేగాలో ఇది 100 రోజుల కనీస ఉపాధి హామీగా కాకుండా గరిష్ఠ పరిమితిగా పనిచేసేది. అటవీ ప్రాంతాల్లో నివసించే షెడ్యూల్డ్ తెగల కుటుంబాలకు లేదా కరవు కాలంలో అదనపు పనిదినాలు కల్పించేందుకు నిబంధనలు సడలించే వారని, కాని ఇప్పుడు ఆ అవసరం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లోని అందరికీ 125 రోజుల పని హక్కు లభిస్తుందని బిల్లును సమర్థిస్తున్న పాలక పక్షం వాదిస్తున్నది. అయితే నరేగా బలం పనిదినాల సంఖ్యతో కాదని, పని కోరే హక్కుపైనే అనేది కొత్త బిల్లు విమర్శకుల వాదన. కార్మికుడి డిమాండుపైన కాకుండా ముందుగా ఆమోదించిన ప్రణాళికల మేరకే పని జరుగుతుందని, దీని వల్ల పనికోరే హక్కు కార్మికులకు ఉండదని వారు వాదిస్తున్నారు.
ఖర్చులో కేంద్ర, రాష్ర్టాల వాటా
రెండవ అంశం విషయానికి వస్తే కొత్త బిల్లులో నిధుల ఖర్చు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. నరేగాలో కేంద్రమే పూర్తిగా నిధుల వ్యయాన్ని భరించేది. కొత్త బిల్లు ప్రకారం కేంద్రం 60% నిధులను భరిస్తే రాష్ర్టాలు 40% భరించాల్సి ఉంటుంది. ఇది సహకార ఫెడరలిజాన్ని పెంపొందిస్తుందని పాలక పక్షం వాదిస్తున్నది. అయితే ఆర్థిక మద్దతు ఇవ్వకుండా కేంద్రం తన బాధ్యతను రాష్ర్టాలపై నెట్టేస్తోందని, పేద రాష్ర్టాలకు ఇది పెను భారం కాగలదని విపక్షాలు తెలిపాయి.
పీక్ సీజన్లో ఉపాధి వాయిదా
మూడవ అంశం విషయానికి వస్తే వరి నాట్లు, పంటల నూర్పిడి వంటి కీలక పంట కాలాల్లో గ్రామీణ ఉపాధిని 60 రోజుల వరకు వాయిదా వేసే నిబంధనను కొత్త బిల్లులో పొందుపరచడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కీలక వ్యవసాయ సమయాల్లో కూలీల కొరత ఏర్పడుతోందని రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిబంధనను బిల్లులో పొందుపరిచింది. ఇది ఉపాధికి, వ్యవసాయ ఉత్పాదకతకు మధ్య సమతుల్యతను తీసుకువస్తుందని పాలక పక్షం వాదిస్తుండగా దేశవ్యాప్తంగా ఒకే రకంగా పంటల సీజన్ ఉండని కారణంగా ఈ నిబంధన గ్రామీణ కార్మికులకు నష్టదాయకం కాగలదని విమర్శకుల వాదన.
కార్మికుల పని కోరే హక్కు
నాలుగో అంశం నరేగా కింద పని కోరే హక్కు కార్మికులకు ఉంటుంది. పని కల్పించని పక్షంలో పరిహారం కోరవచ్చు. కొత్త బిల్లులో ఈ నిబంధనకు చెల్లుచీటీ రాశారు. గ్రామ పంచాయతీల ప్రణాళికల ముందస్తు ఆమోదం మేరకే ఉపాధి పనుల కల్పన జరుగుతుంది. దీని వల్ల గ్రామీణ ఉపాధి స్వభావమే మారిపోగలదని, అధికారుల ప్రణాళికల మేరకు పని దొరుకుతుందని విమర్శకులు వాదించారు.
స్థానిక అవసరాలకు తగ్గ పనులు
చివరిగా ఐదవ అంశం స్థానిక అవసరాల మేరకు పనుల కల్పన. నరేగాలో ఈ ప్రకారమే పనులు జరిగి కార్మికులకు ఉపాధి లభించేది. కాని కొత్త బిల్లులో నీటి భద్రత, గ్రామీణ మౌలిక సౌకర్యాలు, ప్రజా అవసరాలకు సంబంధించిన ఆస్తులు, వాతావరణ పరిరక్షణకు సంబంధించి గ్రామ పంచాయతీలు ముందుగా ఆమోదించిన ప్రణాళికల ప్రకారం పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇది దీర్ఘకాల అభివృద్ధికి మేలు చేస్తుందని పాలక పక్షం వాదించగా స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఉండదని విమర్శకుల వాదన.