Varun Gandhi | ఎంపీ వరుణ్ గాంధీ తన సొంత పార్టీ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే వున్నారు. మొన్నటికి మొన్న టిక్కెట్ల కోసం భయపడే ప్రసక్తే లేదని, నిజాలే మాట్లాడుతానని కుండ బద్దలు కొట్టిన వరుణ్… తాజాగా ప్రధాని మోదీ పాలనపై తీవ్రంగా మండిపడ్డారు. అన్నీ అమ్మేస్తే దేశం గతి ఏంకావాలి? అంటూ సూటిగా ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గ పర్యటనలో భాగంగా వరుణ్ గాంధీపై కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు.
ప్రైవేటైజేషన్ పేరుతో అన్నింటినీ కేంద్రం అమ్మేస్తోందని దుయ్యబట్టారు. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోందని, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. అవినీతి రాజకీయాలపై ప్రజలందరూ అవగాహనతో ఉండాలని, జాగరూకతతో మెలగాలని ఆయన కోరారు. రాజకీయం మొత్తం కూడా లాభాపేక్ష, స్వార్థంతో నిండిపోయిందని, నిజాయితీపరులు రాజకీయాల్లోకి రావాలని వరుణ్ గాంధీ ఆకాంక్షించారు.