న్యూఢిల్లీ, జూలై 7: కేంద్రంలోని ఎన్డీయే సర్కారు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, కర్షక విధానాలపై ట్రేడ్ యూనియన్లు కన్నెర్రజేస్తున్నాయి. బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి మోదీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై మూకుమ్మడిగా గళమెత్తాలని, కార్మిక శక్తికి ఎదురే లేదని చాటాలని నిర్ణయించాయి. తమ డిమాండ్ల సాధనకు దేశంలోని వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగులతో కలిసి బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, భారత్ బంద్ చేపట్టాలని నిర్ణయించాయి. ఈ సార్వత్రిక సమ్మె లేదా భారత్ బంద్‌లో 25 కోట్ల మందికి పైగా పాల్గొంటారని వివిధ యూనియన్లు తెలిపాయి. బ్యాంకింగ్, బీమా, పోస్టల్, బొగ్గు గనులు, రహదారులు, నిర్మాణం ఇలా పలు రంగాలకు చెందిన కార్మికులు సమ్మెలో పాల్గొననుండటంతో దేశ్యాప్తంగా కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.
ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల పాలసీలు, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 9న సార్వత్రిక సమ్మె లేదా భారత్ బంద్ నిర్వహించాలని పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, దాని అనుబంధ సంస్థల ఫోరమ్ పిలుపునిచ్చింది. అధికారిక, అనాధికారిక/అసంఘటిత ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల యూనియన్ల వారు పెద్దయెత్తున పాల్గొని సమ్మెను పూర్తిగా విజయవంతం చేయాలని ఫోరం ఒక ప్రకటనలో కోరింది. సుమారు 25 కోట్ల మంది సమ్మెలో పాల్గొంటారని భావిస్తున్నామని, రైతులు, గ్రామీణ కార్మికులు కూడా ఇందులో పాల్గొని దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తారని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేత అమర్జిత్ కౌర్ వెల్లడించారు.
ఉద్యోగులు, కార్మికులు, శ్రామికుల సమస్యల పరిష్కారం కోరుతూ 17 డిమాండ్లతో నిరుడు కేంద్ర కార్మిక మంత్రి మన్సూఖ్ మాండవీయకు వినతిపత్రం సమర్పించామని ఫోరం వెల్లడించింది. గత 10 ఏండ్లుగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వార్షిక సమావేశాన్ని నిర్వహించకుండానే, తమ వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటూ కార్మిక లోకాన్ని అణచివేస్తున్నదని ఆరోపించింది. సమష్ఠి బేరాలను బలహీన పర్చడానికి, యూనియన్ కార్యకలాపాలను నిర్వీర్యం చేయడానికి, వ్యాపారం చేయడంలో సౌలభ్యం పేరుతో యజమానులకు అనుకూలంగా ఉండటానికి నాలుగు కార్మిక కోడ్లను విధించడానికి కేంద్రం చేయని ప్రయత్ంన లేదని ఫోరం విమర్శించింది.
దేశంలో నిరుద్యోగాన్ని నిర్మూలించాలని, మంజూరైన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కొత్త ఉద్యోగాలు సృష్టించాలని, ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం కింద కార్మికుల పని దినాలు, కూలీ పెంచాలని, ఇదే తరహా పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రవేశపెట్టాలన్నది తమ ప్రధాన డిమాండ్లని ఫోరం తెలియజేసింది. దేశ జనాభాలో 65 శాతం 35 ఏండ్ల లోపు వారు ఉన్నారని, వారిలో గరిష్ఠ నిరుద్యోగులు 20-25 ఏండ్ల మధ్య వారు ఉన్నారని తెలిపింది. ఈ పరిస్థితుల్లో యువతకు ఉపాధి కల్పించి ప్రోత్సహించకుండా రైల్వే, ఎన్ఎండీసీ, రైల్వే, బోధనా రంగాల్లో రిటైర్ అయిన ఉద్యోగులను నియమిస్తున్న కేంద్రం దేశ అభివృద్ధిని తీవ్రంగా దెబ్బ తీస్తున్నదని ఫోరం ఆరోపించింది.