వారణాసి: రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత, దివంగత ఒలింపియన్ మొహమ్మద్ షాహీద్ ఇంటిని వారణాసి మున్సిపల్ అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. అధికారుల చర్యపై దివంగత హాకీ క్రీడాకారుడి కుటుంబ సభ్యులు తీవ్ర నిరసన తెలియచేశారు. తమ ఇల్లు కూలగొట్టి తమను రోడ్డుపాల్జేశారని వారు దుయ్యబట్టారు. నష్టపరిహారం చెల్లించిన ఆస్తులను మాత్రమే కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. కచేరీ-సందాహ మార్గంలో ఉన్న షాహీద్ ఇంటిలోని కొంత భాగాన్ని ఆదివారం మున్సిపల్ అధికారులు కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది.
తనకు ఎటువంటి నష్టపరిహారం అందలేదని, తనకు ప్రత్యామ్నాయ నివాసం కూడా లేదని షాహీద్ వదిన నజ్నీన్ వెల్లడించారు. తన కుటుంబంతో తాను ఇప్పుడు ఎక్కడకు వెళ్లగలనని ఆమె ప్రశ్నించారు. అక్టోబర్లో ఇంట్లో వివాహ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయని షాహీద్ సోదరుడు ముష్తాఖ్ తెలిపారు. తమకు ఎక్కడా అంగుళం భూమి కూడా లేదని ఆయన చెప్పారు. ఇదే కొనసాగితే తాము వీధినపడతామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ప్రముఖ హాకీ క్రీడాకారుడి ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేయడాన్ని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఖండించారు. పద్మశ్రీ మొహమ్మద్ షాహీద్ ఇంటిని బీజేపీ ప్రభుత్వం కూల్చివేసిందని, ఇది ఇల్లు మాత్రమే కాదని, దేశ క్రీడా వారసత్వానికి చిహ్నమని అన్నారు.