Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న రైలు వందే భారత్ స్లీపర్. ఈ రైలు ట్రయల్ రన్ ముంబయి సెంట్రల్ – అహ్మదాబాద్ మధ్య విజయవంతంగా పూర్తయ్యింది. ట్రయల్‌లో భాగంగా ఉదయం 7.29 గంటలకు రైలు అహ్మదాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు ముంబయి సెంట్రల్ చేరుకుంది. మధ్యాహ్నం మళ్లీ ముంబయి సెంట్రల్ నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణం మొదలుపెట్టింది. ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో.. డేటాను విశ్లేషించిన తర్వాత రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) తుది సర్టిఫికెట్‌ను జారీ చేయనున్నది. ఆర్డీఎస్ఓ ట్రయల్స్‌ను పరిశీలిస్తున్నది. ఆ తర్వాత రైలు గరిష్ఠ వేగంపై రైల్వే భద్రతా కమిషన్ ద్వారా మూల్యాంకనం చేయనున్నారు.
ఆ తర్వాతే వందే భారత్ స్లీపర్ రైలుకు అధికారిక ధ్రువీకరణం పొందుతాయి. అన్ని టెస్టుల్లో పాస్ అయిన తర్వాత మాత్రమే రెగ్యులర్ సర్వీస్ కోసం భారతీయ రైల్వేకు అప్పగిస్తారు. ఇటీవల నిర్వహించిన ట్రయల్స్‌లో వందే భారత్ స్లీపర్ ఇప్పటికే 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకున్నది. సమాచారం మేరకు.. వచ్చేవారంలో వందే భారత్ స్లీపర్ రైలుకు సర్టిఫికెట్ జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత రైల్వే బోర్డు సర్వీసు రూట్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ట్రయల్స్‌లో భాగంగా ఈ నెల 2న రాజస్థాన్‌లోని బుండి జిల్లాలోని కోటా – లాబన్ మధ్య స్లీపర్ రైలు గరిష్ఠ వేగం 180 కిలోమీటర్లను చేరుకుంది. అంతకు ముందు రోహల్ ఖుర్ద్ – కోటా మధ్య సైతం 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. కోటా-నాగ్డా, రోహల్ ఖుర్ద్-చౌ మహలా సెక్షన్లలో మాత్రం వరుసగా 170 కిలోమీటర్లు, 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.
వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లుంటాయి. ఇందులో 11 థర్డ్ ఏసీ టైర్ కోచ్‌లుంటాయి. నాలుగు సెకండ్ ఏసీ టైర్ కోచ్‌లు, ఒకటి ఫస్ట్ ఏసీ కోచ్ ఉంటుంది. అన్నింట్లో ప్రత్యేకంగా చార్జింగ్ పోర్ట్‌లు, ఫోల్డబుల్ స్నాక్ టేబుల్, ఇంటిగ్రేటెడ్ లైటింగ్ సిస్టమ్, ల్యాప్‌టాప్ చార్జింగ్ సెటప్ తదితర అధునాతన ఫీచర్స్‌ను సైతం రైల్వేశాఖ జోడించింది. ఫస్ట్ ఏసీ కోచ్‌లో 24 బెర్తుంటాయి. ఇక సెకండ్ ఏసీ కోచ్‌లో 48 సీట్లు ఉంటాయి. థర్డ్ ఏసీ కోచ్‌లోని ఐదింటిలో 67 బెర్తులు, మరో నాలుగింట్లో 55 బెర్తుల చొప్పున ఉంటాయి. రైలు సహాయక సిబ్బంది కోసం సైతం 38 ప్రత్యేక బెర్తులంటాయి. దృష్టిలోపం ఉన్న ప్రయాణికులకు సహాయం అందించేందుకు బ్రెయిలీ నావిగేషన్ సైతం అమర్చారు.