భువనేశ్వర్: గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి వెళ్తున్న విద్యార్థుల వ్యాన్ బోల్తా పడింది. (van carrying students overturns) ఈ ప్రమాదంలో ఒక స్టూడెంట్ మరణించగా డ్రైవర్‌తో సహా 23 మంది గాయపడ్డారు. ఒడిశాలోని సుబర్ణపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అథాగఢ్లోని నార్త్ బంకి మాలా బీహార్పూర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు సారందా మైదానానికి వ్యానులో బయలుదేరారు. ఆ వాహనం ముందు టైర్ వదులుగా ఉండటంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ వ్యాను బోల్తాపడింది.
కాగా, ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు. డ్రైవర్, ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా, మిగతా విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.