వడోదర, జూలై 10: గుజరాత్ వడోదర జిల్లాలో బుధవారం కుప్పకూలిన ‘గంభీర’ వంతెన అత్యంత ప్రమాదకరంగా ఉన్నదని 2022లోనే సామాజిక కార్యకర్త లఖన్ దర్బార్ హెచ్చరించారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులు స్వీయ పరిశీలనలోనూ అదే తేలింది. దీనిని బయటకు రానివ్వలేదని లఖన్ దర్బార్ అంటున్నారు. ‘అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వంతెన ఉంది. ఇక ఇది ఎంతో కాలం నిలవదు. కొత్తది కట్టండి లేదా పాతదాన్ని రిపేర్ చేయండి’ అంటూ 2022లో ప్రభుత్వ అధికారులను ఆయన వేడుకున్నారు. రోడ్లు, భవనాల అధికారులతో ఆయన చెప్పిన మాటలకు సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి సోషల్మీడియాలో వైరల్ అవుతున్నది.
ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉన్నా, ప్రభుత్వ యంత్రాంగాలు సరైన సమయానికి స్పందించలేదని, దానివల్లే ఈ విషాదం జరిగిందని లఖన్ దర్బార్ అన్నారు. కాగా, ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య గురువారం నాటికి 16కు చేరుకుంది. గల్లంతైన మరో నలుగురి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని జిల్లా అధికారులు తెలిపారు. ఈ వంతెన దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నాటిది. వంతెనలో రెండు పిల్లర్ల మీద ఉన్న స్లాబ్ బుధవారం ఉదయం 7 గంటలకు హఠాత్తుగా కుప్పకూలింది. ఇప్పటివరకు మొత్తం 16 మృతదేహాలను గుర్తించామని వడోదర ఎస్పీ రోహన్ ఆనంద్ చెప్పారు.