వడోదర, జూలై 10: గుజరాత్ వడోదర జిల్లాలో బుధవారం కుప్పకూలిన ‘గంభీర’ వంతెన అత్యంత ప్రమాదకరంగా ఉన్నదని 2022లోనే సామాజిక కార్యకర్త లఖన్ దర్బార్ హెచ్చరించారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులు స్వీయ పరిశీలనలోనూ అదే తేలింది. దీనిని బయటకు రానివ్వలేదని లఖన్ దర్బార్ అంటున్నారు. ‘అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వంతెన ఉంది. ఇక ఇది ఎంతో కాలం నిలవదు. కొత్తది కట్టండి లేదా పాతదాన్ని రిపేర్ చేయండి’ అంటూ 2022లో ప్రభుత్వ అధికారులను ఆయన వేడుకున్నారు. రోడ్లు, భవనాల అధికారులతో ఆయన చెప్పిన మాటలకు సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నది.
ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉన్నా, ప్రభుత్వ యంత్రాంగాలు సరైన సమయానికి స్పందించలేదని, దానివల్లే ఈ విషాదం జరిగిందని లఖన్ దర్బార్ అన్నారు. కాగా, ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య గురువారం నాటికి 16కు చేరుకుంది. గల్లంతైన మరో నలుగురి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని జిల్లా అధికారులు తెలిపారు. ఈ వంతెన దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నాటిది. వంతెనలో రెండు పిల్లర్ల మీద ఉన్న స్లాబ్ బుధవారం ఉదయం 7 గంటలకు హఠాత్తుగా కుప్పకూలింది. ఇప్పటివరకు మొత్తం 16 మృతదేహాలను గుర్తించామని వడోదర ఎస్పీ రోహన్ ఆనంద్ చెప్పారు.
జూన్పూర్: విద్యుత్తు సమస్యను ఎదుర్కొంటున్నామని, పరిష్కరించాలంటూ విన్నవిస్తే దానికి సమాధానం దాటేసి ‘జై బజరంగ్‌బలి’ అని నినాదాలు చేసిన యూపీ విద్యుత్తు శాఖ మంత్రి అరవింద్ కుమార్ శర్మ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సురాపూర్ను సందర్శించిన మంత్రికి స్థానికులు తాము ఎదుర్కొంట్ను విద్యుత్తు సమస్య గురించి విన్నవించారు.
ఈ ప్రాంతంలో కేవలం మూడు గంటలు మాత్రమే విద్యుత్తును సరఫరా చేస్తున్నారని, దీని కారణంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు మంత్రికి తెలిపారు. అయితే దీనికి మంత్రి సమాధానం ఇవ్వకుండా ‘జై బజరంగ్ బలి, బోలియో శంకర్ భగవాన్ కీ జై, జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేసి తన కారెక్కి అక్కడి నుంచి తుర్రుమన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో మంత్రి చర్యను పలువురు తప్పుబడుతున్నారు.
ముంబై: క్యాంటీన్ కాంట్రాక్టర్‌ను కొట్టిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. డ్యాన్స్, లేడీస్ బార్లు నడిపే దక్షిణాది వారికి మహారాష్ట్రలో ఆహార సరఫరా కాంట్రాక్టులను ఇవ్వకూడదన్నారు. “షెట్టీ అనే పేరున్న వ్యక్తికి కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారు? మరాఠీ వ్యక్తికి ఇవ్వండి. మనం ఏం తింటామో వారికి తెలుస్తుంది.
వారు మనకు మంచి నాణ్యమైన ఆహారం అందిస్తారు. దక్షిణాది వారు డ్యాన్స్ బార్లు, లేడీస్ బార్లు నడుపుతారు, మహారాష్ట్ర సంస్కృతిని నాశనం చేస్తారు. వాళ్లు మన పిల్లలను కలుషితం చేస్తున్నారు. వాళ్లు మంచి ఆహారాన్ని ఎలా అందిస్తారు?” అని మండిపడ్డారు. షిండే వర్గానికి చెందిన గైక్వాడ్ రెండుసార్లు బుల్ధానా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
థాణె: బాత్రూమ్లో కనిపించిన రక్తం మరకలు విద్యార్థినుల రుతు స్రావం వల్ల ఏర్పడ్డాయని అనుమానించిన ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం బాలికల దుస్తులు విప్పించి తనిఖీలు చేయడం వివాదాస్పదమైంది. బీజేపీ పాలిత మహారాష్ట్రలోని షహాపూర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ అమానుష ఘటనను నిరసిస్తూ బాధితుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట బుధవారం ధర్నా నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఓ బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పాఠశాల పిన్సిపల్, నలుగురు టీచర్లతో సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. విద్యార్థిని తండ్రి కథనం ప్రకారం షహాపూర్లోని ఆర్ఎస్ దమానీ స్కూల్ శౌచాలయంలో రక్తపు మరకలు కనిపించాయి. దీంతో పాఠశాల యాజమాన్యం 5-10 తరగతుల విద్యార్థినులను సమావేశపరచి వారు రుతుస్రావ చక్రంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని ప్రశ్నించింది.
రుతు స్రావంలో ఉన్నామని చెప్పిన విద్యార్థినుల వేలి ముద్రలను టీచర్లు సేకరించారు. రుతుస్రావంలో లేమని చెప్పిన బాలికలను ఒకరి తర్వాత ఒకరిని ఓ ఉద్యోగిని శౌచాలయంలోకి తీసుకెళ్లి వారి మర్మావయవాలను తనిఖీ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఇన్స్పెక్టర్ ముకేశ్ దంగే తెలిపారు.
భోపాల్, జూలై 10: కరెంట్ కనెక్షన్ కూడా ఇవ్వకుండానే డిజిటల్ క్లాస్ ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్ బీజేసీ సర్కారు అభాసుపాలైంది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని సింగ్రోలి జిల్లా జోగియాని గ్రామ పంచాయతీలోని ఒక పాఠశాలను ఎంపిక చేసిన అధికారులు.. దానిలో స్మార్ట్ క్లాస్ పథకాన్ని అమలు చేశారు.
అందులో భాగంగా ఆ పాఠశాలకు ఎల్ఈడీ టీవీని ఏర్పాటు చేశారు. ఇంతా చేసిన తర్వాత ఆ పాఠశాలకు కనీసం విద్యుత్తు కనెక్షన్ లేదన్న విషయం గుర్తొచ్చి నాలుక కర్చుకున్నారు. అధికారుల ఈ చర్య గ్రామస్తులు, విద్యార్థుల్లో ఆగ్రహాన్ని కలిగించింది.
ముంబై: బీజేపీ పాలిత మహారాష్ట్రలోని ముంబైలో వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లైఓవర్ నాసిరకం పనుల బండారం దానిని ప్రారంభించిన నాలుగు రోజులకే బయటపడింది. శిల్పటా-కళ్యాణ్‌లను కలుపుతూ సుమారు 250 కోట్లతో 562 మీటర్ల ఫ్లైఓవర్‌ను నిర్మించారు. పలావా ఫ్లైఓవర్‌గా పేరొందిన కటై-నిల్జే పై వంతెనను జూలై 4న శివసేన ఎంఎల్ఏ రాజేశ్ మోరే ప్రారంభించారు. అయితే అది ప్రారంభించిన నాలుగు రోజులకే దాని బండారం బయటపడింది.
వదులుగా ఉన్న కంకర, బురద నేల, సిమెంట్ పెచ్చులు తీయడం, అస్తవ్యస్తంగా, అసమానంగా వేసిన తారు భద్రతా ప్రమాణాలను అపహాస్యం చేస్తూ ప్రయాణికులకు సవాల్ విసురుతున్నాయి. ఈ వంతెనను ప్రారంభించిన రోజే ఇద్దరు బైకర్లు జారిపడి గాయపడ్డారు. కొందరైతే ఈ వంతెనను స్కిడ్డింగ్ జోన్‌గా విమర్శిస్తున్నారు.
ఇప్పటికే బ్రిడ్జిపై సుమారు 450 మీటర్ల ప్రాంతం కంకర తేలి నిర్మాణ నాణ్యతను తెలియజేస్తున్నది. గోతులతో నిండిన ఈ ఫ్లైఓవర్ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. కాగా, ఫ్లైఓవర్ పని నాణ్యతపై తీవ్ర విమర్శలు రావడంతో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్డీసీ) హడావిడిగా కాంట్రాక్టర్లను రప్పించి రోజంతా ఆదరాబాదరాగా పైపై పూతలు పూసి గోతులు కన్పించకుండా మెరుగులు దిద్దింది.
ఇండోర్, జూలై 10: భోపాల్‌లో 90 డిగ్రీల మలుపుతో ఐష్బాగ్ రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణంతో అపఖ్యాతి పాలైన బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ తాజాగా జెడ్ ఆకృతిలో ఇండోర్‌లో నిర్మిస్తున్న మరో వంతెన స్థానికులతోపాటు ట్రక్కు డ్రైవర్లను, పారిశ్రామికవేత్తలను హడలెత్తిస్తున్నది. ఇండోర్‌లోని లక్ష్మీనగర్ నుంచి భగీరథ్‌పురా మీదుగా పోలో గ్రౌండ్‌ని కలిపే ఈ ఆర్వోబీని మధ్యప్రదేశ్ పీడబ్ల్యూడీ చేపట్టింది. ఈ వంతెనలో 90 డిగ్రీల కోణంలో జెడ్ ఆకృతిలో రెండు మలుపులు ఉండడం సర్వత్రా విమర్శకు దారితీస్తున్నది.
ఈ ఆర్వోబీ డిజైన్‌పై ఆందోళన చెందుతున్న ఇండోర్ ఎంపీ శంకర్ లాల్వాణీ రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రికి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. ప్రజల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలతో పునరాలోచనలో పడిన అధికారులు ఆర్వోబీ డిజైన్‌పై సమీక్షలు జరుపుతున్నారు.
అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపడతామని ఈఈ గుర్మీత్ కౌర్ తెలిపారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. భోపాల్‌లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన వంతెన విజయవంతమైన తర్వాత ఇండోర్‌కు మరో ప్రత్యేకమైన వింత నమూనాను రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తోందంటూ కాంగ్రెస్ విమర్శించింది.
గురుగ్రామ్: బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లోని డొల్లతనం, భారీ అవినీతి ఇటీవల కురిసిన వర్షాలతో బయటపడుతున్నది. బీజేపీ పాలిత హర్యానాలోని గురుగ్రామ్‌లో బుధవారం కురిసిన భారీ వర్షానికి ఏకంగా రోడ్డులో కొంత భాగం కూలిపోయి పెద్ద బిలంలా ఏర్పడింది. రాత్రి 10.30 గంటలకు వర్షంలో సదరన్ పెరీఫెరల్ రోడ్‌పై ఒక ట్రక్ వెళ్తుండగా, హఠాత్తుగా రోడ్డు కొట్టుకుపోయి భారీ గొయ్యి పడటంతో అందులోకి ట్రక్ బోల్తా పడింది. అయితే ట్రక్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
కాగా, ఇటీవలే ఈ రోడ్లో మురికి కాలువ నిర్వహణ పనులను అధికారులు నిర్వహించారు. కాగా, భారీ వర్షానికి గురుగ్రామ్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్ వేలోని నర్సింగ్‌పూర్ ప్రాంతం ఈ భారీ వానకు తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ప్రాంతంలో రహదారితో పాటు అండర్‌పాస్‌లు నీటితో నిండిపోయాయి.