ఆదివారం 17 జనవరి 2021
National - Dec 26, 2020 , 03:03:14

టీకా.. ట్రయల్స్

టీకా.. ట్రయల్స్

  • ‌28, 29 తేదీల్లో నాలుగు రాష్ర్టాల్లో నిర్వహణ
  • టీకా కార్యక్రమం సన్నద్ధతపై  డ్రై రన్‌
  • టీకా వేయడం మినహా అన్ని దశల పరిశీలన

న్యూఢిల్లీ: దేశంలో భారీ ఎత్తున కరోనా టీకాలు వేయాలని సంకల్పించిన కేంద్రప్రభుత్వం అందుకోసం అన్నిరకాలుగా సిద్ధమవుతున్నది. కోట్లమందికి ఒకేసారి నిర్వహించే టీకా కార్యక్రమాన్ని అన్ని స్థాయిల్లో పటిష్ఠంగా నిర్వహించేందుకు ముందుగానే డ్రై రన్‌ (మాక్‌ డ్రిల్స్‌) నిర్వహించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, అసోం, పంజాబ్‌ రాష్ర్టాల్లో రెండు జిల్లాల చొప్పున ఎంపిక చేసి ఈ నెల 28, 29 తేదీల్లో డ్రైరన్‌ నిర్వహించనున్నారు. వ్యాక్సినేషన్‌ కోసమే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘కో- విన్‌' ఆన్‌లైన్‌ వేదిక ద్వారా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. రెండు రోజులపాటు ఐదు సెషన్లుగా ఈ మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నారు. 

ప్రతి దశ పరిశీలన

జిల్లా దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్‌ (సీహెచ్‌సీ), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు దవాఖానలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో కొన్నింటిని ఎంపిక చేసి ఈ మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తారు. టీకా సరఫరా, టెస్టింగ్‌, ఆరోగ్యకేంద్రానికి టీకాల కేటాయింపు, టీకా బృందాల తరలింపు, ఆరోగ్యకేంద్రంలో ప్రజలకు టీకాలు వేసే విధానం (మాక్‌ డ్రిల్‌), టీకా వేసిన తర్వాత కో-విన్‌లో రిపోర్టు చేయటం, కోల్డ్‌ స్టోరేజీల పరిశీలన, సెషన్‌ తర్వాత ముగింపు సమావేశం తదితర దశలను ఈ డ్రై రన్‌లో పరీక్షిస్తారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నిజమైన టీకా వేయటం తప్ప వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఉండే అన్ని దశలను నిర్వహించి చూస్తామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కో-విన్‌ పనితీరును కూడా ఈ డ్రై రన్‌తో పరీక్షించి చూస్తామని చెప్పారు. 

నెగిటివ్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే రండి: అమెరికా

 బ్రిటన్‌కు రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్న దేశాల్లో అమెరికా కూడా చేరింది.  బ్రిటన్‌ నుంచి వచ్చే విమాన ప్రయాణికులు కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే రావాలని సూచించింది.  

24 గంటల్లో ధారావిలో ఒక్క కేసు లేదు

కొద్దికాలం కిందట కరోనా హాట్‌స్పాట్‌గా నిలిచిన ముంబైలోని ధారావి ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ ప్రాంతంలో తొలిసారిగా ఏప్రిల్‌లో కరోనా కేసు వెలుగుచూసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 24 గంటల వ్యవధిలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఇదే మొదటిసారి.