న్యూఢిల్లీ, డిసెంబర్ 27: కరోనా టీకా కోసం 15-18 ఏండ్ల మధ్య వయసున్న పిల్లలు జనవరి 1 నుంచి ‘కొవిన్’ పోర్టల్‌లో బుకింగ్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పోర్టల్‌లో అదనంగా స్లాట్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. వయసు ధ్రువీకరణ కోసం స్కూల్ ఐడీ కార్డులను కూడా ఉపయోగించవచ్చని పేర్కొంది. చాలా మంది పిల్లలకు ఆధార్ కార్డు లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది. జనవరి 3వ తేదీ నుంచి 15-18 ఏండ్ల మధ్య పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం మార్గదర్శకాలు జారీచేసింది. పిల్లలకు కేవలం కొవాగ్జిన్ టీకానే వేయనున్నట్టు అందులో స్పష్టం చేసింది. డీసీజీఐ అనుమతించిన టీకాల్లో ఈ వయసువారికి సరిపోయేది కొవాగ్జిన్ ఒక్కటే కాబట్టి ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వివరించింది. ‘2007, అంతకుముందు జన్మించినవారు ఈ టీకాలు పొందేందుకు అర్హులు’ అని పేర్కొన్నది. కొవిన్‌లో రిజిస్టర్ చేసుకోలేని వారు.. టీకా కేంద్రాల్లో కూడా పేర్లను నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. ప్రభుత్వ కేంద్రాల్లో పిల్లలకు, ప్రికాషన్ డోసు వారికి ఉచితంగానే టీకా ఇస్తామని తెలిపింది.
తేదీ సమీపించగానే అలర్ట్
హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 ఏండ్లు పైబడిన వృద్ధులకు.. వారు రెండో డోసు వేసుకొన్న 9 నెలల తర్వాతే మూడో డోసు (ప్రికాషన్ డోసు) వేయనున్నట్టు కేంద్రం తెలిపింది. మూడో డోసు వేసుకొనే తేదీ సమీపించగానే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు సందేశాలు పంపిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొంది. ముందు జాగ్రత్త డోసును జనవరి 10 నుంచి వేయనున్నారు. కాగా, ఫస్ట్, సెకండ్ డోస్ ఏ టీకా వేసుకున్నారో ప్రికాషన్ డోసుగా అదే టీకా వేయనున్నట్టు, టీకా మిక్సింగ్ ప్రస్తుతానికి లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది. శనివారం ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మూడో డోసును ముందు జాగ్రత్త డోసుగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దీన్ని బూస్టర్ డోసు అంటుండగా మోదీ ఇలా పేర్కొనడం ప్రజలను కొంత గందరగోళానికి గురిచేసింది. దీనిపై ప్రభుత్వ వర్గాలను అడగ్గా.. ‘భారతీయుల్లో ఇప్పటికే ఇమ్యూనిటీ ఉంది. ముందు జాగ్రత్తగా టీకా వేస్తున్నాం కాబట్టి ముందు జాగ్రత్త డోసుగా మోదీ పేర్కొన్నారు’ అని చెప్పాయి. పేరు ఏదైనా టీకా వేసే ఉద్దేశం ఒక్కటేనని ప్రముఖ వైద్యుడు నరేష్ ట్రెహాన్ అన్నారు.
పిల్లల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..
ప్రికాషన్ డోసు అర్హుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ
రెండో డోసు వేసుకొన్న 9 నెలల తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్సెమ్మెస్ అలర్ట్ వస్తుంది.
ప్రికాషన్ డోసుకు అర్హులైన వాళ్లు కొవిన్ యాప్ లేదా వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి.
షెడ్యూల్ బటన్ కనిపిస్తుంది. దాన్ని నొక్కాలి.
డోసులు అందుబాటులో ఉన్న కేంద్రాలను చూసి వ్యాక్సినేషన్ తేదీ, సమయాన్ని ఎంచుకొంటూ స్లాట్ బుక్ చేసుకోవాలి.