న్యూఢిల్లీ, డిసెంబర్ 13: దేశీయ విమానయాన రంగంలో (Aviation Sector) పలు కీలక పోస్టులు భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్న మాట వాస్తవమేనని కేంద్రం అంగీకరించింది. భద్రతను నిర్ధారించడానికి, ఆకాశంలో, నేలపై విమానాల కదలికలను నిర్వహించేందుకు శిక్షణ పొందిన నిపుణులైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు (ATCలు)కు భారత్‌లో కనీసం 1,260 మంది కొరత ఉంది.
ప్రస్తుతం దేశంలో 22.75 శాతం ఏటీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ వెల్లడించారు. లోక్‌సభలో టీఎంసీ ఎంపీ రచనా బెనర్జీ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇస్తూ మానవ వనరుల కొరత కారణంగా ఎలాంటి కీలక కార్యక్రమాలను నిలిపివేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 5537 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో ఎయిర్‌పోర్టుల అథారిటీ (AAI) ఎయిర్ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నదని చెప్పారు.