ఉత్తరకాశీ, నవంబర్ 22: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో బుధవారం రాత్రి కీలక ముందడుగు పడింది. కార్మికులను కాపాడటానికి చేపట్టిన 57 మీటర్ల డ్రిల్లింగ్ పనులు తుది దశకు వచ్చాయి. రాత్రి 11.30 గంటల సమయంలో టన్నెల్ లోపలికి ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర సరంజామాతో ప్రవేశించారు. రెస్క్యూ ఆపరేషన్ అత్యంత కీలక దశకు చేరుకుందని అక్కడి అధికారులు వెల్లడించారు.
టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చిన తర్వాత.. వారిని దవాఖానకు తరలించేందుకు అధికారులు పదుల సంఖ్యలో అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ‘గురువారం తెల్లవారుజాము సూర్యోదయాన్ని కార్మికులు చూడబోతున్నారు. వారి కుటుంబాలకు గుడ్ న్యూస్’ అంటూ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులు చెప్పారు.