Uttarakhand | ఉత్తరకాశీ, ఆగస్టు 10: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో ఈ నెల 5న వచ్చిన ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన ధరాలీ, హర్షిల్ గ్రామాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన 5 వేల రూపాయల సహాయాన్ని గ్రామస్తులు నిర్దంద్వంగా తిరస్కరించారు. ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తామన్న ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట తప్పి 5 వేలను ఇవ్వడమేమిటని వారు బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం ఇచ్చే ఈ సహాయం ఏ మూలకని వారు ప్రశ్నించారు.
అయితే ఇది తాత్కాలిక సహాయం మాత్రమేనని చెప్పిన అధికారుల వాదనను తిరస్కరించిన రెండు గ్రామాల ప్రజలు.. పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం తమకు జరిగిన నష్టాన్ని తక్కువగా చూపేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కాగా ఆకస్మిక వరదల్లో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో ఐదో రోజు కూడా సహాయ, రక్షణ చర్యలు కొనసాగాయి.
పలు చోట్ల వరద నీటిలో చిక్కుకుపోయిన గ్రామస్తులను హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే వరద నీటిలో చిక్కుకున్న బాధితులకు ఆహార పొట్లాలు అందజేశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు డాగ్ స్కాడ్, థెర్మల్ ఇమేజింగ్ పరికరాల సహాయంతో ధరాలీ బజార్లో శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా? అని పరిశీలించాయి.