డెహ్రాడూన్: నిర్మాణంలో ఉన్న భారీ బ్రిడ్జ్ కూలిపోయింది. (Under Construction Bridge Collapses) కొండ ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మిస్తున్న ‘సిగ్నేచర్ బ్రిడ్జ్’ కుప్పకూలింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు తెలిపారు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో ఈ సంఘటన జరిగింది. రుద్రప్రయాగ్లో భారీ వంతెన రూపు దిద్దుకుంటోంది. కొండ రాష్ట్రంలో తొలి ‘సిగ్నేచర్ బ్రిడ్జ్’గా పిలిచే దీనిని బద్రీనాథ్ హైవేపై నార్కోటాలో నిర్మిస్తున్నారు. రూ.76 కోట్ల వ్యయంతో ఆర్సీసీ డెవలపర్స్ ఈ వంతెనను నిర్మిస్తోంది.
కాగా, గురువారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న ఈ వంతెన కూలింది. అయితే పునాది చెక్కుచెదరలేదని, టవర్ మాత్రమే కూలిందని అధికారి తెలిపారు. సాంకేతిక కమిటీ దీనిని పరిశీలిస్తుందని, తప్పు ఎక్కడ జరిగిందో గుర్తిస్తుందని చెప్పారు. సాధారణంగా ప్రతి రోజూ 40 మంది కార్మికులు పని చేస్తారని మరో అధికారి తెలిపారు. అయితే గురువారం ఈ వంతెనపై ఎవరూ పని చేయలేదని, దీంతో ఎవరికీ ఏమీ కాలేదని చెప్పారు.
మరోవైపు ఉత్తరాఖండ్లో తొలిసారి ప్రత్యేకంగా నిర్మిస్తున్న ‘సిగ్నేచర్ బ్రిడ్జ్’ పనులు నాసిరకంగా, నిర్లక్ష్యంగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. హైవే అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం తగినంత శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ను ప్రస్తుత కంపెనీ నుంచి మరొకరికి ఎందుకు ఇవ్వడం లేదు? అని స్థానికులు ప్రశ్నించారు.