లక్నో: సాధారణంగా మనకు చిరుతపులి కనిపిస్తే ఏం చేస్తాం..? ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తాం..! ఒకవేళ అది మనలను గుర్తించి దాడి చేసినా భయంతో మొత్తుకోవడం తప్ప ఏమీ చేయలేం..! కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్గఢ్ జిల్లాకు చెందిన ఓ మేకల కాపరి మాత్రం ప్రాణాలకు తెగించి చిరుతతో పోరాడాడు. కోపంతో మీదకు దూసుకొస్తున్న చిరుతను చివరికి తన దగ్గరున్న కొడవలితో దాడిచేసి హతమార్చాడు.
వివరాల్లోకి వెళ్తే.. పితోర్గఢ్ జిల్లాలోని నైనీ గ్రామానికి చెందిన నరేష్సింగ్ మేకల కాపరి. ఎప్పటిలాగే బుధవారం కూడా మేకలను మేపేందుకు వెళ్లాడు. అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ చిరుతపులి తన మేకల మందపై దాడిచేసింది. ఇది గమనించిన నరేష్సింగ్ భయంతో పారిపోకుండా.. చిరుతను వెళ్లగొట్టి మేకలను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. దాంతో ఆగ్రహించిన చిరుత మేకలను వదిలేసి నరేష్సింగ్పై దాడిచేసింది.
నరేష్సింగ్ తన చేతిలో ఉన్న కర్రతో చిరుతను బెదరగొట్టే ప్రయత్నం చేసినా అది బెదరలేదు. పైగా మరింత ఆగ్రహంతో నరేష్సింగ్ పైకి దూసుకురాసాగింది. దాంతో ప్రాణ రక్షణ కోసం నరేష్సింగ్ తన దగ్గరున్న కొడవలితో చిరుతను నరికి చంపేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. కానీ, ఆత్మరక్షణ కోసం చిరుతను చంపినందున నరేష్సింగ్పై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.