ఆదివారం 12 జూలై 2020
National - Jun 23, 2020 , 11:14:56

రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తికి కరోనా మెసేజ్‌.. 20 మంది క్వారంటైన్‌

రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తికి కరోనా మెసేజ్‌.. 20 మంది క్వారంటైన్‌

న్యూఢిల్లీ: రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా అతడి మొబైల్‌కి మెసేజ్‌ వచ్చింది. దీంతో అతడితోపాటు ప్రయాణిస్తున్న 20 మందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌కు చెందిన 48 ఏండ్ల వ్యక్తి నోయిడాలోని ఓ బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఇటీవల అతడితోపాటు ఫ్యాక్టరీలోని సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే రిపోర్టు రాకముందే అతడు డెహ్రాడూన్‌ వెళ్లేందుకు ఆదివారం ఘజియాబాద్‌లో జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కాడు. 

రైలులో ఉండగా అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు మొబైల్‌ ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. హరిద్వార్‌ జిల్లాలోని రూర్కీకి రైలు చేరుతుండగా అతడు దీని గురించి కరోనా కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేశాడు. దీంతో హరిద్వార్‌ వైద్య అధికారులు అతడిని రైలు నుంచి దించి కరోనా దవాఖానలో చేర్చారు. అలాగే కంపార్ట్‌మెంట్‌లో అతడితోపాటు ప్రయాణించిన 20 మందిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. కాగా, కరోనా పరీక్ష ఫలితం రాకముందే నిర్లక్ష్యంగా వ్యవహరించి రైలులో ప్రయాణించిన అతడి తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

logo