Sobhita Dhulipala | గూఢచారి, మేజర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది శోభిత ధూళిపాళ్ల. ఈ భామ నటించిన హాలీవుడ్ చిత్రం ‘మంకీ మ్యాన్’ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో ఆమె అభినయానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఇదిలావుండగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోతో ఈ భామ ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
‘ప్రేమ అద్భుతమైన భావన. మన జీవితాన్ని నడిపించే ఇంధనం. ప్రతి ఒక్కరికి కావాల్సిన నిజమైన విలాసం ప్రేమనే’ అంటూ సమాధానమిచ్చింది. ఈ మాటలతో ఆమె ప్రేమాయణం నిజమే అనుకుంటున్నారు. తన కెరీర్ గురించి ఈ భామ మాట్లాడుతూ ‘ తెరపై నేను పోషించిన పాత్రలను చూసి నిజజీవితంలో కూడా కఠినంగా ఉంటానని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు. స్వతహాగా నేను సున్నిత మనస్కురాలిని. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా ఉంటాను. ప్రతి విషయంలో ఇతరులపై ఆధారపడతాను. చిన్న ఆనందాలకు కూడా పొంగిపోతాను’ అని చెప్పుకొచ్చింది.