డెహ్రాడూన్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలో భగవద్గీత శ్లోకాల పారాయణాన్ని (Bhagavad Gita Shlokas) ఉత్తరాఖండ్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు పుష్కర్‌సింగ్ ధామీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సాంప్రదాయ భారతీయ జ్ఞానాన్ని ఆధునిక విద్యతో మిళితం చేయడం, విద్యార్థులలో స్వీయ క్రమశిక్షణ, నాయకత్వం, భావోద్వేగ సమతుల్యత వంటి విలువలను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రతిరోజూ ఒక గీతా శ్లోకాన్ని పఠించడంతోపాటు, దాని అర్థం, ఔచిత్యాన్ని విద్యార్థులకు వివరించాలని ఆదేశించింది.
ఉపాధ్యాయులు ప్రతీ వారం ఒక శ్లోకాన్ని ఎంచుకోవాలని, దానిని అర్థంతోపాటు పాఠశాల నోటీసు బోర్డులో రాయాలయని సూచించింది. విద్యార్థులు దానిని నేర్చుకునేలా ప్రోత్సహించాలని తెలిపింది. క్లాస్‌రూం యాక్టివిటీలో భాగంగా వారంలో చివరలో ఆ శ్లోకంపై చర్చ, విద్యార్థుల అభిప్రాయం తీసుకోవాలని పేర్కొంది. ఇది భారతదేశ సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను ఆధునిక విద్యా చట్రంలో ఏకీకృతం చేయడాన్ని నూతన జాతీయ విద్యా విధానం (NEP) ప్రోత్సహిస్తున్నదని వెల్లడించింది.
కాగా, విద్యార్థులలో నైతిక విలువలు, భారతీయ సంస్కృతి, వారసత్వం పట్ల అవగాహన పెంచడానికి పాఠ్యపుస్తకాలలో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, రామాయణాన్ని చేర్చాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిని రాష్ట్రంలోని 17వేల ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. భారతీయ సంస్కృతికి అద్దం పట్టే గ్రంథాలను పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా విద్యార్థులలో విలువలతో కూడిన విద్యను అందించవచ్చని విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ తెలిపారు. ఈ గ్రంథాలు కేవలం మత పరమైనవి కావని, జీవితానికి అవసరమైన నైతిక విలువలు, జీవన విధానాన్ని బోధిస్తాయన్నారు.