Sanjeevani | హైదరాబాద్, జనవరి 14 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): రామాయణంలోని సంజీవని ఔషధ మొక్క గురించి తెలియనివారు ఉండరు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న లక్ష్మణుడిని పూర్వ స్థితిలోకి తీసుకురావడానికి హిమాలయాల నుంచి హనుమంతుడు ఈ మొక్కను తీసుకొచ్చినట్టు పురాణాల సారాంశం. అయితే ఇప్పటికీ హిమాలయాల్లోని ద్రోణగిరి ప్రాంతంలో ఈ మొక్క ఉన్నట్టు పలువురి నమ్మకం. దీంతో 2016లో ఈ ఔషధ మొక్కను వెదకడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.25 కోట్లతో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
తీవ్రంగా శ్రమించిన ఆ బృందం 2020లో ఓ మొక్కను గుర్తించి ల్యాబ్లో పరీక్షలకు పంపించింది. ఇంతలో ‘అదే సంజీవని మొక్క’ అంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే, రామాయణంలోని సంజీవని మొక్క అదేనా? అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. కారణం.. ఆ మొక్క గురించి ఇప్పటికీ పరిశోధనలు జరుగుతుండటమే. ఈ అంశంపై బృందంలో సభ్యుడైన మయారం ఉన్నియాల్ మాట్లాడుతూ.. తాము గుర్తించిన ఔషధ మొక్కకు కొన్ని రోగాలను మాత్రమే నయం చేసే గుణాలు ఉన్నాయని తెలిపారు. అయితే, ఇదే సంజీవని అని చెప్పడానికి మరికొన్ని ఆధారాలు సేకరించాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. కాగా, రామాయణ కాలం నుంచి ఇప్పటివరకూ వాతావరణంలో ఎన్నో మార్పులు జరిగాయని, అందుకనే సంజీవని మొక్క ఇలా రూపాంతరం చెంది కొన్ని గుణాలు కోల్పోయిందని మరికొందరు వాదిస్తున్నారు.