Chhavi Varshney : మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యూట్యూబర్ మరణించింది. ఆమెతోపాటు తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. మృతులను ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా, మహా ఖాస్ గ్రామానికి చెందిన ఛావి వర్షిణీ (23), ఆమె తల్లి సారికగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఛావి తండ్రి శ్యామ్‌లాల్, బంధువు సూరజ్‌పాల్, డ్రైవర్ సచిన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని, ఉజ్జైన్-గారోత్ నాలుగు లేన్ల రహదారిపై రామఖేడి గ్రామం వద్ద మంగళవారం ఉదయం జరిగింది.
ఛావి వర్షిణీ ఒక యూట్యూబర్. 2021లో ప్రారంభించిన ఆమె యూట్యూబ్ ఛానెల్‌కు ప్రస్తుతం 7 లక్షల మందికిపైగా సబ్స్క్రైబర్లున్నారు. ఆమె డైలీ వ్లాగ్స్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. ఈ ఘటనకు సంబంధించి సోమవారం రాత్రి ఛావి వర్షిణీ తన తల్లి సారిక, తండ్రి శ్యామ్ లాల్, బంధువు సూరజ్‌పాల్, డ్రైవర్ సచిన్‌తో కలిసి కారులో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జైన్కు బయల్దేరింది. కారులో మొత్తం ఐదుగురు ఉన్నారు. అయితే, మంగళవారం ఉదయం ఈ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ కారు, ట్రక్కు ఢీకొన్నాయి.
ఈ ఘటనలో ఛావి (23), ఆమె తల్లి సారిక (50) ప్రాణాలు కోల్పోగా.. తండ్రి శ్యామ్‌లాల్, బంధువు సూరజ్‌పాల్, డ్రైవర్ సచిన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందుకున్న ఎన్హెచ్ఏఐ అంబులెన్సులు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అగర్లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. బరోడ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.