లక్నో: ఇంట్లో గొడవ నేపథ్యంలో ఒక మహిళ తన భర్తను మంచానికి కట్టేసి కొట్టింది. అంతేగాక అతడికి కరెంట్‌తో విద్యుత్ షాకులు ఇచ్చింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. (woman ties husband to cot, beats) ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 5న రాత్రి వేళ సంజీవ్ తివారీ, అతడి భార్య మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ తన భర్తను రాత్రంతా మంచానికి కట్టేసింది. అతడ్ని కొట్టడంతో పాటు కరెంట్ వైర్లతో విద్యుత్ షాకులు ఇచ్చింది. రాత్రంతా అతడ్ని మంచానికి కట్టేసి నిర్బంధించింది.
కాగా, మంచానికి కట్టేసి ఉన్న సంజీవ్ తివారీ తీవ్రంగా గాయపడినట్లు సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఆ ఇంటికి చేరుకున్నారు. సంజీవ్‌ను తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అందించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
మరోవైపు సంజీవ్ తివారీ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. అతడి సోదరుడి ఫిర్యాదుతో నిందితురాలైన భార్యను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.