మొరాదాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాకు చెందిన అమీనా(31) అయిదు రోజుల వ్యవధిలో ఇద్దరు మగ శిశువులను, ఇద్దరు ఆడ శిశువులను ప్రసవించింది. మొరాదాబాద్‌లోని తీర్థంకర్ మహావీర్ విశ్వవిద్యాలయ దవాఖానలో ఆమెకు రెండు సార్లు సాధారణ ప్రసవం జరిగిందని వైద్యులు తెలిపారు. ఈ నెల 9న జరిగిన మొదటి కాన్పులో ఒక మగ శిశువు జన్మించగా, 14న జరిగిన కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. అమీనా గర్భవతిగా ఉన్న సమయంలో అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా ఆమె గర్భంలో నాలుగు గర్భస్థ పిండాలున్నట్టు వైద్యులు గుర్తించి వాటిని రెండింటికి తగ్గించుకొమ్మని ఆమె కుటుంబానికి సలహా ఇచ్చారు.
అయితే వారు నలుగురు పిల్లలు కావాలని కోరుకోవడంతో అమీనాకు తగిన వైద్య సాయం అందించేందుకు వైద్యులు అంగీకరించారు. కాన్పుకు ముందు ఆమె రక్తపోటు, కాలేయ సంబంధిత సమస్యలతో కొన్నిసార్లు దవాఖానలో చికిత్స పొందింది. అయితే కాన్పు తర్వాత తల్లీ బిడ్డల పరిస్థితి స్థిమితంగా ఉంది. ఇలా రోజుల వ్యవధిలో నలుగురు పిల్లలు పుట్టడం అరుదైన, సవాల్‌తో కూడిన ఘటన అని వైద్యులు తెలిపారు.