న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో (Republic Day Parade) ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘మహా కుంభ్’ శకటం ఎంతో ఆకట్టుకున్నది. ప్రయోగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కుంభమేళాకు సంబంధించిన శకటాన్ని గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఆ రాష్ట్రం ప్రదర్శించింది. మహా కుంభ్ విశిష్ఠత, గొప్పతనాన్ని అందులో చాటింది. విరాసత్, వికాస్‌కు మూలమైన సంగమాన్ని ఇది ప్రతిబింబించింది.
కాగా, ఈ శకటం ముందు ఏర్పాటు చేసిన ‘అమృత కలశం’ ఎంతో ఆకట్టుకున్నది. పవిత్ర ‘అమృతధార’ ప్రవాహాన్ని ఇది సూచించింది. సాధువులు శంఖం ఊదుతూ, త్రివేణి సంగమంలో స్నానం చేస్తూ, ధ్యానంలో నిమగ్నమైన చిత్రాలు శకటం చుట్టూ ఉన్నాయి. గంగా, యమున, సరస్వతి సంగమం వద్ద పవిత్ర జలాల్లో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్న చిత్రాలు, అఖారాలు, అమృత స్నానం కోసం వెళ్తున్న భక్తుల చిత్రాలను కూడా ప్రదర్శించారు.
మరోవైపు శకటం వెనుక భాగంలో దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేస్తున్న నమూనాను ఏర్పాటు చేశారు. అలాగే సముద్ర మథనం వల్ల ఉద్భవించిన 14 రత్నాలను కూడా చిత్రీకరించారు. మొత్తంగా మహా కుంభ్ విశిష్ఠత, పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతలను సూచించిన ఉత్తరప్రదేశ్ శకటం ఎంతో ఆకట్టుకున్నది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్నది.
Uttar Pradesh Tableau 🔥🔥 #MahaKumbh2025
#RepublicDay #RepublicDay2025 | #76thRepublicDay | #RepublicDay | #RepublicDayPara pic.twitter.com/grOKkVdBIU— Lucifer (@krishnakamal077) January 26, 2025