Uttar Pradesh | లక్నో, మే 30: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని విద్యుత్ సరఫరా, ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలిపే ఉదంతమిది! విద్యుత్తు కోతల వల్ల బలియా జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొబైల్ టార్చ్‌లైట్ వెలుతురులో నలుగురు మహిళలు ప్రసవించిన సంగతి వెలుగులోకి వచ్చింది. సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ దెబ్బతినటంతో విద్యుత్తు సరఫరా ఆగిపోయిందని తెలిసింది.
ఇదే జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఓ ఆరోగ్య కేంద్రం మెట్లమీదే ఓ గర్భిణి ప్రసవించటం రాష్ట్రంలో సంచలనం రేపింది. రాష్ట్రంలో విద్యుత్తు కోతలు, ప్రజారోగ్య కేంద్రాల్లో అధ్వాన పరిస్థితులకు ఈ ఘటనలు అద్దం పడుతున్నాయని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తాజా ఘటనపై బాలియా ముఖ్య వైద్య అధికారి డాక్టర్ సంజీవ్ బర్మన్ మాట్లాడుతూ, ‘బెరువార్ బారీ పీహెచ్సీ ఇన్చార్జ్, ఇతర అధికారుల నుంచి వివరణ కోరాం. దవాఖాన వద్ద ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్న తర్వాత, దాన్ని మార్చారు. జెనరేటర్ కూడా మంచి కండీషన్లోనే ఉంది. అయినా ఈ ఘటన జరగటంపై విచారణకు ఆదేశించాం’ అని అన్నారు.