లక్నో: చీఫ్ ఎలక్షన్ కమీషనర్ సుశీల్ చంద్ర ఇవాళ లక్నోలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది జరనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి ఆయన సమాచారం ఇచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..నిర్దేశిత సమయంలో ఎన్నికలను నిర్వహించాలని అన్ని రాజకీయ పార్టీలు కోరినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీలు ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. యూపీలో మహిళా ఓటర్ల సంఖ్య అయిదు లక్షలు పెరిగినట్లు ఆయన చెప్పారు. కొత్తగా 52.08 లక్షల మంది ఓటర్ల జాబితాలో చేరినట్లు తెలిపారు. బూత్, పోలింగ్‌పై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
బూత్ శానిటైజేషన్..
యూపీలో దాదాపు 50 శాతం మంది వ్యాక్సినేట్ అయినట్లు సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. వ్యాక్సినేషన్ వేగాన్ని మరింత పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. ఒమిక్రాన్ కేసుల అంశం గురించి మాట్లాడుతూ.. యూపీలో ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు అయినట్లు తెలుస్తోందన్నారు. కోవిడ్ సంక్షోభం నేతృత్వంలో.. పోలింగ్ అధికారులు అంతా నూరు శాతం వ్యాక్సినేట్ అయి ఉంటారన్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు అందేలా చూస్తామన్నారు.
గంట పొడిగింపు..
పోలింగ్ బూత్‌లను కోవిడ్ నిబంధనలకు తగినట్లు తయారు చేయనున్నట్లు సీఈసీ వెల్లడించారు. ప్రతి ఓటరుకు శానిటైజర్‌ను ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. పోలింగ్ సమయాన్ని గంట పెంచాలని కమీషన్ నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. సోషల్ డిస్టాన్స్ పాటించాల్సి వస్తుంది కాబట్టి పోలింగ్ సమయాన్ని గంట పెంచినట్లు ఆయన తెలిపారు. అన్ని పోలింగ్ బూత్‌లను శానిటైజ్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. యూపీలో ఎన్నికల నిర్వహణ అంశం గురించి ఎన్నికల సంఘం మూడు రోజుల పర్యటన చేపట్టింది. అన్ని పార్టీలతో ఈసీ బృందం కలిసింది. ఆ తర్వాతే ఇవాళ సీఈసీ సుశీల్ చంద్ర మీడియాతో మాట్లాడారు.
8 నుంచి 6 వరకు పోలింగ్
ఎన్నికల నేపథ్యంలో 5 వేల మంది పోలీసులను యూపీలో బదిలీ చేశారన్నారు. పోలింగ్‌ను ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించారు. సోషల్ మీడియా, పెయిడ్ న్యూస్‌పై నిఘా పెట్టనున్నట్లు చెప్పారు. అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పోలింగ్ బూత్‌కు రాలేనివారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జనవరి అయిదో తేదీ తర్వాత సంపూర్ణ ఓటర్ల జాబితా రిలీజ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖతో చర్చించిన తర్వాత యూపీ పోలింగ్ సమాచారాన్ని ఇచ్చినట్లు సీఈసీ చెప్పారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. లైవ్ వెబ్ క్యాస్టింగ్ ఉంటుందన్నారు. సీ విజిల్ యాప్‌ను తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఆ యాప్‌లో ఫిర్యాదులు నమోదు చేయవచ్చు అన్నారు.
అయిదు రాష్ట్రాల పోలింగ్ తేదీలను ప్రకటించిన తర్వాత.. ర్యాలీలకు సంబంధించిన మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నట్లు సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.